ఎకరాకు రూ.25 కోట్లు ఇస్తా: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఆఫర్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం నాడు సవాల్ విసిరారు. మల్లన్న ప్రాజెక్టు కోసం భూములు తీసుకోవడంపై ఆయన స్పందించారు.
మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 48 గంటల దీక్ష చేస్తానని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు ఎందుకు పర్యటించడం లేదో చెప్పాలన్నారు. కేసీఆర్ పాంహౌస్ భూములకు ఎకరాకు రూ.25 కోట్లు చెల్లిస్తామని, వాటిని ప్రజలకు ఇస్తారా అని సవాల్ చేసారు.
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర రావు, రవీంద్ర కుమార్‌లను సాంఘిక బహిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

గుత్తాపై టిపిసిసి చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం
పార్టీ మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వ్యభిచారి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మొదట రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ రెండేళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
బీజేపీపై భట్టి
దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని బీ జేపీ ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన త్యాగాలేమీ లేవన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత సంక్షేమానికి ఇవ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications