"ఆ ఒక్కటీ అడక్కు" తేల్చేసిన రేవంత్ రెడ్డి; ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో కొత్త లొల్లి!!
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి . వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి ఇద్దరు నేతలతో మంతనాలు జరిపినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఎల్లారెడ్డిలో అసలు కాంగ్రెస్ కొట్లాటకు కారణమేమిటి? జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా జరిగిందేమిటి? ధిక్కార స్వరం వినిపిస్తున్న నేత రహస్యంగా జరుపుతున్న మంతనాల మర్మం ఏమిటి? వంటివి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య టికెట్ రగడ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మదన్మోహన్, మరో సీనియర్ నేత సుభాష్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వచ్చే ఎన్నికలలో ఎల్లారెడ్డిపై కన్నేసిన ఇద్దరు ఆధిపత్యం కోసం నియోజకవర్గంలో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఈ క్రమంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఎల్లారెడ్డి లో పర్యటించిన సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తలపడ్డారు. ఇక వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ రాష్ట్రస్థాయిలో చర్చకు కూడా దారితీసింది.

ఎల్లారెడ్డి టికెట్ ఎవరికో తెల్చేసిన్న రేవంత్ రెడ్డి
ఇక ఎల్లారెడ్డి వర్గ పోరుకు చెక్ పెట్టాలని భావించిన రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా బసచేసిన క్యాంపులో ఇద్దరు నేతలను పిలిచి విడివిడిగా మాట్లాడారని సమాచారం. సుభాష్ రెడ్డికి రెండుసార్లు అన్యాయం జరిగింది కాబట్టి, ఈసారి ఎల్లారెడ్డి టికెట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డికే ఇస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని సమాచారం. ఇక మదన్ మోహన్ కు సైతం జహీరాబాద్ పార్లమెంట్ కానీ, బాన్సువాడ అసెంబ్లీ కానీ ఇస్తామని ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ఎల్లారెడ్డి మాత్రం అడగద్దని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మదన్ మోహన్ కు తేల్చి చెప్పారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

ఎల్లారెడ్డి టికెట్ కోసం ధిక్కార స్వరం వినిపిస్తున్న మదన్ మోహన్
ఇక రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత డీలా పడిన మదన్మోహన్, ఎల్లారెడ్డి సీటు విషయంలో టీపీసీసీ మాట కంటే ఏఐసిసి మాటకే ప్రాధాన్యతను ఇస్తానని ఫ్రస్టేట్ అవుతున్నట్టు సమాచారం. ఇక ఇదే క్రమంలో కార్యకర్తలతో విడివిడిగా భేటీ అయిన ఆయన, ఎల్లారెడ్డి సీట్ విషయంలో ఏం చేయాలన్న దానిపై సమానలోచనలు జరుపుతున్నారని సమాచారం. ఇక ఇదే క్రమంలో పీసీసీ నేతలపై మీడియా సమావేశం పెట్టి మరీ బహిరంగ విమర్శలు చేసిన ఆయన, తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఒక చేరికల సభలో మదన్మోహన్ తన సీటే కాదు తనకు 10 సీట్లు ఇప్పించే సత్తా ఉందని ప్రకటన చేశారు. దీంతో మదన్మోహన్ వ్యాఖ్యలు హస్తం పార్టీ అగ్ర నేతలకు ఏమాత్రం రుచించడం లేదు.

రేవంత్ వ్యతిరేకవర్గంతో మదన్ మోహన్ మంతనాలు.. కొనసాగుతున్న రగడ
దీంతో వారు ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన సీటుకే గ్యారెంటీ లేదనే సంకేతాలను ఎల్లారెడ్డి లో జరిగిన సభ వేదికగా పంపించారు. ఇక ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సభానంతరం ఆలోచనలో పడిన మదన్మోహన్ రేవంత్ వ్యతిరేకవర్గంతో మంతనాలు చేస్తూ భవిష్యత్తు కార్యాచరణకు పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. మదన్మోహన్ ఏఐసిసి పెద్దలతో లాబీయింగ్ మొదలుపెట్టడంతో పాటు పీసీసీ డోంట్ కేర్.. ఏఐసిసి సుప్రీమ్ అంటూ బహిరంగ ప్రకటన చేయడంతో ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు జారీ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం.

ఎల్లారెడ్డి టికెట్ వివాదం ఏమవుతుందో ?
ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినప్పటికీ మదన్మోహన్ మాత్రం అదే సీటుపై ఆశలు పెట్టుకొని పోటీ చేస్తే ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా నైనా ఎల్లారెడ్డి లోనే బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఎల్లారెడ్డి టికెట్ రగడ మరి ముందు ముందు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications