శంషాబాద్ వరకూ మెట్రో లోగుట్టు ఇదే: తండ్రీకొడుకులా అవినీతి అంటూ రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మెట్రో ప్రాజెక్ట్‌పై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ ధనదాహం తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

మెట్రో పొడగింపునకు కారణమేంటి?
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రవాణా వ్యవస్థను జీఎమ్మార్ సంస్థే ఏర్పాటు చేసేలా ఆనాటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందనీ.. అయినప్పటికీ రాయదుర్గం-శంషాబాద్ రూట్‌లో కొత్తగా మెట్రో రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వెనుక కారణాలేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ బంధువుల కోసమే..
కేసీఆర్ బంధువైన ప్రవీణ్ రావు, మై హోం సంస్థ, ఇతర బంధువుల భూముల విలువ పెరగటం కోసమే ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారని రేవంత్ ఆరోపించారు. మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం అపేయాలని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసింది నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు.

తండ్రీ కొడుకుల దోపిడీ
కేసీఆర్ కుటుంబం పట్టపగలే తెలంగాణను దోపిడీ చేస్తుందని ధ్వజమెత్తారు. తండ్రీ-కొడుకుల దోపిడితో భవిష్యత్తులో బంగారు తెలంగాణ కాకపోగా అప్పుల తెలంగాణగా మారుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవాచేశారు.

రేవంత్ సవాల్
మెట్రోను అడ్డుపెట్టుకొని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారనేది ముమ్మాటికి వాస్తవమని ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న మెట్రో స్కామ్‌పై కోర్టుకు వెళ్తామన్నారు. తను మెట్రో ప్రాజెక్టుపై చేసినవి అసత్య ఆరోపణలయితే ఏ శిక్షకైనా సిద్దమేనని రేవంత్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications