కవిత, కాళేశ్వరంపై ఈడీ, సీబీఐ దాడులేవీ?: ఆ పార్టీల చీకటి ఒప్పందమంటూ రేవంత్
హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సమస్యలపై చర్చ జరగకుండా ప్రజలను బీజేపీ, టీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ రెండు పార్టీలు ప్రజాప్రతినిధుల కొనుగోలు కోసం కమిటీలు వేశాయని ఆరోపించారు. మునుగోడులో నేతల కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని దుయ్యబట్టారు. మునుగోడులో నేతల జేబులు నిండాయి తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
Recommended Video

కవితపై సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదు: రేవంత్
గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చెల్లించిన డబ్బును పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కవిత మీద బీజేపీ ఎంపీలు లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారన్న రేవంత్.. సీబీఐ, ఈడీ మరి ఆమె ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బీజేపీ బ్లాక్ మెయిల్ చేసి ప్రొటెక్షన్ మనీ సంపాదిస్తోందని ఆరోపించారు.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందమంటూ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు చేస్తున్నాయన్నారు. బండి పాద యాత్ర వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం లేదని, ఆయనకు మోకాళ్ల చిప్పలు అరుగుతాయని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికల ముంగిట విద్యుత్ బకాయిల పేరిట మరో పంచాయితీ తెచ్చారన్నారు. ఆగస్టు 8న మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని, అయితే చీకటి ఒప్పందం కారణంగా టీఆర్ఎస్ ఎంపీలెవరూ పార్లమెంటుకు రాలేదన్నారు. ఉభయకుశలోపరి మాదిరిగా బీజేపీ, టీఆర్ఎస్ ఒకరినొకరు తిట్టుకుంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.

గులాం నబీ ఆజాద్ అందుకే పార్టీని వీడారన్న రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్నారు. ఇక, గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడటంపైనా రేవంత్ స్పందించారు. రాజ్యసభ పొడిగించలేదనే ఆజాద్ పార్టీని వీడారన్నారు. 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి.. అత్యధిక బెనిఫిట్ పొందారన్నారు. గాంధీ కుటుంబంపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

మునుగోడు అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటిస్తుందన్న ఉత్తమ్
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని త్వరలో ఏఐసీసీ ప్రకటిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కసరత్తు టీపీసీసీ స్థాయిలో పూర్తయిందని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను ఏఐసీసీకి పంపినట్లు వెల్లడించారు. రాజకీయ లబ్ధికోసమే రాజాసింగ్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటోందని ఎంపీ ఉత్తమ్ ఆరోపించారు. ఉపఎన్నికల వేళ ఓట్ల కోసం కొత్తగా విద్యుత్ బకాయిల లొల్లిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.












Click it and Unblock the Notifications