కేసీఆర్ ను ఉరేసినా తప్పులేదు: సీఎం రేవంత్ మాస్ స్పీచ్
ఆనాటి బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ SLBC టన్నెల్ పడావు పెట్టాడని.. నల్గొండ రైతులపై పగబట్టి SLBCని పూర్తి చేయలేదని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు గత బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు.
"పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ SLBC టన్నెల్ పడావు పెట్టాడు. 34 కిలోమీటర్లు పూర్తయిన SLBC ని ఏడాదికి ఒక కిలోమీటర్ తవ్వినా అయిపోయేది. కానీ చేయలేదు. పడావుపడిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మూడేళ్లలో కేసీఆర్ లక్ష కోట్లు మింగి కూళేశ్వరం కట్టాడు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలో కూలిపోయింది. కేసీఆర్ ను ఉరేసినా తప్పులేదు" అని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.

కేసీఆర్ నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసినా 8 నెలల్లో ఎంపీని అయ్యాను. 2006లో జడ్పీటీసీగా రాజకీయం మొదలు పెట్టిన నేను 2024లో ముఖ్యమంత్రి అయ్యాను. శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్లుగా బీఆర్ఎస్ వాళ్ల పరిస్థితి ఉంది. మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి తీరుతాం. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాను. ఇప్పటికే 5000 కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేశాం. మిగిలిన 4వేల కోట్ల త్వరలోనే వేస్తాం.
హూజూర్ నగర్ కు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నానని సీఎం రేవంత్ అన్నారు. మిర్యాలగూడకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను మంజూరు చేస్తున్నానని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి బాట వైపు తమ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తెలంగాణను దేశానికి నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ తెలిపారు.












Click it and Unblock the Notifications