పార్లమెంట్ లో తెలంగాణా వరదల రచ్చ.. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి
గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. వరదల కారణంగా గోదావరి నది ఉప్పొంగడంతో అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ క్రమంలో వేలాదిమంది ఇల్లు వదిలి పునరావాస కేంద్రాలకు చేరి తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు.

పార్లమెంట్ కు చేరిన తెలంగాణా వరదల రచ్చ
ఇక వరదల మేనేజ్మెంట్లో తెలంగాణ సర్కార్ విఫలమైందని ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని లేఖ రాశారు. ఈ క్రమంలో తాజాగా నేటి నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో లోక్సభలో తెలంగాణ వరదలపై మల్కాజ్గిరి ఎంపీ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతో తెలంగాణ వరదలలో కెసిఆర్ ప్రభుత్వం వైఫల్యం పై కొనసాగుతున్న రచ్చ ఇప్పుడు పార్లమెంట్ కు చేరింది.

పార్లమెంట్ లో తెలంగాణా వరదలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి
పార్లమెంటు సమావేశాలలో వరదల సమస్యను లేవనెత్తాలని మరియు సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుండి ప్రత్యేక బృందాలను పంపాలని, అలాగే తక్షణ వరద సహాయాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద కల్పించిన హక్కుల అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈమేరకు నేడు తెలంగాణా వరదలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది.

వందేళ్ళలో రాని వరద.. 11లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందన్న రేవంత్ రెడ్డి
తెలంగాణాలో గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద వచ్చిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలని రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానంలో కోరారు. వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసం అయిందని, మొత్తంగా 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తన తీర్మానం లో రేవంత్ రెడ్డి వెల్లడించారు.

కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి, తక్షణ సహాయ ప్యాకేజ్ ఇవ్వాలి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి, తక్షణ సహాయ ప్యాకేజీ కింద రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించిన నష్టాలను సరి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని రేవంత్ రెడ్డి తన వాయిదా తీర్మానంలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి అని పేర్కొన్నారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు కేంద్రప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని రేవంత్ రెడ్డి తన వాయిదా తీర్మానంలో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications