రైతులకు శుభవార్త... అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పెట్టుబడి సాయాన్ని రైతులకు అందచేసింది. రైతుబంధు నిధులను వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ ముందు వరకు 5 ఎకరాల్లోపు రైతులకు నిధులు విడుదల చేయగా ఇప్పుడు 5 ఎకరాలపైన సాగుభూమి ఉన్నవారికి కూడా నిధులు విడుదలయ్యాయి. దీనికోసం ప్రభుత్వం రూ.2వేల కోట్ల నిధులను సమీకరించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వ్యవసాయశాఖ నేరుగా డబ్బులు జమచేసింది.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరుతో అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాలు పూర్తికాకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకాన్నే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తోంది. తాజాగా 5 ఎకరాలపైన ఉన్నవారికి కూడా పెట్టుబడి సాయం అందించింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితినేతలు రైతుభరోసా పథకానికి సంబంధించి రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుబంధు పథకాన్ని ఆపేశారని.. ఐదెకరాల వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని.. మిగతా వారికి మొండిచెయ్యి చూపిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తొమ్మిదో తేదీలోపు అందరు రైతులు ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాట ఇచ్చినట్లుగా ఈరోజు నిధులు విడుదల చేసింది.
గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చివరిసారిగా గత ఏడాది ఆగస్టులో వానాకాలం సీజన్‌కు మొత్తం 1,52,49,486.39 ఎకరాలకుగాను 68,99,976 మంది రైతులకు రూ.7,624.74 కోట్లు విడుదల చేసింది.












Click it and Unblock the Notifications