కేసీఆర్‌కు రేవంత్ సర్కారు ఆహ్వానం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్లు పూర్తవుతుండటంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఈ ఏడాది పదో రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం కావడంతో వేడుకలను ధూంధాంగా చేసేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు.
అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో పదివేల మందితో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వేలాదిమంది ఉద్యమించినా, ప్రధాన ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరు ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సోనియాతోపాటు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపనున్నట్టు సమాచారం.
రాష్ట్ర గీతావిష్కరణ
ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాగాంధీ చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. "జయ జయ హే తెలంగాణ" అనే గీతాన్ని ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4 న కేబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది.
ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రివర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.












Click it and Unblock the Notifications