కాంగ్రెస్ గెలుస్తుంది, ఆయనే సీఎం అవుతారు: మోత్కుపల్లి జోస్యం, చంద్రబాబు అరెస్టుపై ఇలా
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అంతేగాక, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారో కూడా ఆయన జోస్యం చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ నాయకత్వంలోని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని మోత్కుపల్లి అన్నారు.
ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, పార్టీ నేతలు ఐకమత్యంగా సాగి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు మోత్కుపల్లి నర్సింహులు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు. కాంగ్రెస్ పగ్గాలను రేవంత్ చేపట్టిన నుంచి రాష్ట్రంలో పార్టీ పుంజుకుందని చెప్పారు.

ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు మోత్కుపల్లి. మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. తెలంగాణ ఎన్నికలకు నవంబర్ నెల 3న నోటిఫికేషన్ విడుదలై.. డిసెంబర్ 3న కౌంటింగ్‌తో పూర్తి కానున్నాయి.
ఇది ఇలావుండగా, మోత్కుపల్లి నర్సింహులు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఉపవాస దీక్ష చేపట్టారు. బేగంపేటలోని తన నివాసంలో దీక్షకు దిగారు. దసరా వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. జగన్ జైలుకు పోయివస్తే.. అందరూ పోవాలా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారన్నారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని మండిపడ్డారు. జగన్ తండ్రి పాలించినా ఇంత కుట్ర చేయలేదన్నారు. ప్రజలు జగన్ ఆట కట్టిస్తారని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications