చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ: తెలంగాణ పగ్గాలు అప్పగింత?
విజయవాడ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. నేరుగా విజయవాడకు వెళ్లిన రేవంత్ రెడ్డి మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి చంద్రబాబును కలిశారు.
ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకండా దేశంలో ఎక్కడైనా తిరగడానికి ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు అవసరమైన అడ్డంకులు తొలిగిపోయినట్లు భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర టిడిపి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలుగుదేశం జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న క్రమంలో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్ రమణ కొనసాగుతున్నారు. ఆయనను ఆ పదవిలో కొనసాగిస్తూనే రేవంత్ రెడ్డికి ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ప్రస్తుతం వంద మంది ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలో 60 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications