రేవంత్ హామీ: తెలంగాణ కాంగ్రెస్ సర్కారులో తొలి ఉద్యోగం ఆమెకే
తెలంగాణ రాష్ట్రంలో గురువారం (డిసెంబర్ 7న) కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరనుంది. ఈ నేపథ్యంలో తొలి ఉద్యోగం హైదరాబాద్ నగరంలోని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయికి ఇవ్వనున్నారు.రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబ్ గ్యారెంటీలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆ యువతికి జాబ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందించారు.
ఈ మేరకు ఇప్పటికే రజినీకి ఆహ్వానం అందించారు. ఆమెకు రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం గురువారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో తనకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినట్లు రజినీ తెలిపారు. తనకు రేపటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని తెలిపారు. తనకు జాబ్ ఇస్తానని చెప్పిన మాటను వారు నిలబెట్టుకుంటారని చెప్పారు.

తాను పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేసినప్పటికీ.. తనకు ఎలాంటి ఉద్యోగం లభించలేదన్నారు. తాను ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రైవేట్ రంగంలోని ఉద్యోగం రాలేదని చెప్పారు. దీంతో తాను అనేక ఇబ్బందులు పడినట్లు చెప్పారు. రేవంత్ సీఎం కాగానే తనకు ఉద్యోగం ఇస్తే తనకు ఎంతో సంతోషకరమైన సందర్భం అవుతుందని వ్యాఖ్యానించారు.
కాగా, హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితరులను రేవంత్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలను కూడా ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు రేవంత్.
తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనీయా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శకపాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. అందుకే 2023, డిశంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయబోతోంది అని సందేశాన్ని ఇచ్చారు. ఈ మహోత్సవానికి ప్రజలందరూ రావల్సిందిగా ఇదే నా ఆహ్వానం అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications