"కథలు"కంచికి - కేసీఆర్ ఫాం హౌస్ కి: రేవంత్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు.
నిన్న హైదరాబాద్ లో వర్షాలు, వరదలపై కేటీఆర్ ను కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ విశ్వనగరంపై ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ మాట్లాడాలని ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా రైతుల సమస్యలపై కెసిఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గతంలో వరి వేస్తే ఉరేనని కెసిఆర్ చెప్పారని గుర్తు చేసి, కెసిఆర్ చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదని వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి అనగనగా ఒక కేసీఆర్...వరి వేస్తే ఉరన్నాడు... ఆయనే 150 ఎకరాలల్లో వరి వేశాడు అని ఎద్దేవా చేశారు.
అంతేకాదు 24 గంటల కరెంటు అన్నాడని, కానీ లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని తెలుస్తుందని పేర్కొన్నారు. మరోవైపు రైతులకు ఎరువులు ఫ్రీ అని చెప్పాడని, కానీ అటువంటి పరిస్థితి లేదని, రైతులు గంటల తరబడి క్యూలలో నిలుచున్నప్పటికీ రైతులకు కావలసిన ఎరువులు అందడం లేదని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కెసిఆర్ చెప్పేవన్నీ కథలని, "కథలు" కంచికి కెసిఆర్ ఫామ్ హౌస్ కి అంటూ సెటైర్ వేశారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్నది ఏమీలేదని, కెసిఆర్ చెప్పేవన్నీ వట్టి ముచ్చటలేనని రేవంత్ రెడ్డి తన ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకు ఒక పత్రికలోని ఒక వార్తను కూడా పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications