దళితుల కంటే వెనకబడే, ముస్లింబంధు: కేసీఆర్ టూ మోడీ వయా అసద్: రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం, బీజేపీలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కారు(టీఆర్ఎస్)నో, పతంగి(ఎంఐఎం)నో నమ్ముకుంటే మోసపోయేది మీరే అంటూ మైనార్టీనుద్దేశించి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. శనివారం ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మైనార్టీ గర్జన సభలో ఆయన మాట్లాడారు.

ముస్లింలు దళితులకంటే వెనుకబడ్డారంటూ రేవంత్ రెడ్డి
దళితుల కంటే కూడా ముస్లింలు వెనుకబడ్డారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మైనార్టీ సభ ఓట్ల కోసం పెట్టింది కాదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని, నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వైయస్సార్ నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతో మంది మైనార్టీలకు అవకాశాలు లభించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలదేనని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందన్నారు రేవంత్ రెడ్డి. కారునో.. పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరేనని హెచ్చరించారు.

ట్రిపుల్ తలాక్ లాంటి చట్టాలు వచ్చేవా?.. కేసీఆర్ టూ మోడీ వయా అసద్
ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వద్ద 200 మంది ఎంపీలు ఉంటే అలాంటి చట్టాలు తెచ్చే ధైర్యం చేసేవారా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ చెప్పారనే మైనార్టీల ఓట్లు కేసీఆర్‌కు వెళ్లాయని తెలిపారు. కారు స్టీరింగ్ తన చేతిలో ఉందని చెప్పుకునే అసద్.. ట్రిపుల్ తలాక్‌కు అనుకూలంగా రంజిత్ రెడ్డి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించారు. మైనార్టీలకు ఎవరి వల్ల నష్టం జరుగుతుందో చెప్పాలనే మైనార్టీ గర్జన చేపట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్‌కు వేసే ఓటు బీజేపీకి వెళ్తుందన్నారు.

కేసీఆర్‌ను కొట్టాలంటే అసద్ అడ్డొస్తున్నాడు.. 12 శాతం రిజర్వేషన్లిస్తే..
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఒక్కరికి మంజూరు చేయలేదన్నారు. మైనార్టీలకు శత్రువైన కేసీఆర్‌ను కొట్టాలంటే.. మధ్యలో అసద్ అడ్డు ఉన్నారన్నారు. మోడీకి మద్దతుగా నిలిచిన కేసీఆర్ పార్టీని ఓడించాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. 12 శాతం రిజర్వేషన్ ఇస్తే ముస్లింలకు 20 నుంచి 30వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. దళిత బంధులాగా మైనార్టీ బంధు ప్రవేశపెట్టి ప్రతి ముస్లిం కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చేశారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.
Recommended Video

హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిపై కసరత్తు
ఇది ఇలావుండగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు. హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖను బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొన్నటివరకు కాంగ్రెస్‌లో కొంత బలమైన నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి పార్టీని విడటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఈ రోజు సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హుజూరాబాద్ అభ్యర్థి రేసులో కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ , ఓ ఎన్ఆర్ఐ ఉన్నట్లు సమాచారం. హజూరాబాద్ ఉపఎన్నికలో బరిలోకి దింపుదామనే ఆలోచనిలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. కొండా సురేఖ ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తారో లేదో అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.












Click it and Unblock the Notifications