చంద్రబాబు పేరెత్తితే చెప్పుతో కొడతా ; బాబు ముద్ర తొలగించుకునే పనిలో రేవంత్ రెడ్డి .. డిఫెన్స్ మొదలైందిగా!!
తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిద్దుబాటు మొదలుపెట్టారా? పదేపదే చంద్రబాబు ముద్రవేస్తూ టార్గెట్ చేస్తున్న టిఆర్ఎస్ నేతలకు గట్టిగానే సమాధానం చెబుతున్నారా? కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి, తనపై ఉన్న బాబు ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు? చంద్రబాబు పేరు ఎత్తితే చెప్పుతో కొడతా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం అదేనా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

కాంగ్రెస్ కు చంద్రబాబు మార్క్ కష్టాలు
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక అప్పటినుండి దూకుడుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. చంద్రబాబు బినామీ రేవంత్ రెడ్డి అని, చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్నాడని, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని ఫ్రాంచైజీ గా మార్చుకొని, రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకుందని రకరకాలుగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు పై, చంద్రబాబు పార్టీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీపై మళ్లేలా చూడాలని తెగ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ .. కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణాలో , కాంగ్రెస్ లో దుమారం
మొన్నటికి మొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డిని చంద్రబాబుకు బినామీగా వ్యాఖ్యానించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో అందరికీ తెలుసని ఆ చిలక మనదే అయినా పలుకు పరాయిదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఫ్రాంఛైజీలా తీసుకుని రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా చేశారని, చంద్రబాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసారా మాట్లాడారు .అంతేకాదు చంద్రబాబు ఆడించే తోలుబొమ్మలాటలోరేవంత్ రెడ్డి ఒక బొమ్మ అని మంత్రి కేటీఆర్ చిత్రీకరించారు. రేవంత్ రెడ్డినిముందు పెట్టి చంద్రబాబు అంత నడిపిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ చంద్రబాబు బినామీ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్లకుఏమాత్రం మింగుడు పడడం లేదు.

టీపీసీసీ చీఫ్ పారదర్శకతపై ఆరోపణలతో రేవంత్ రెడ్డికి పెద్ద చిక్కు
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టిడిపి నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా పట్టం కడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకపక్క టీపీసీసీ చీఫ్ పారదర్శకత పైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, సొంత పార్టీలోనూ రాష్ట్రవ్యాప్తంగానూ రేవంత్ రెడ్డి పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ముందు ముందు మరింత పెద్ద సమస్య కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చంద్రబాబుపై నోరు విప్పారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుతో లింక్ పెడితే చెప్పుతో కొడతా అంటూ ధ్వజం
తాజాగా టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి దిద్దుబాటు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు టిడిపి నుండి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నడూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసేలా చేశాయి. ఇటీవల ఏ సమావేశం ఏర్పాటు చేసినా, ఎక్కడ డిబేట్లో చర్చించినా ప్రధానంగా చంద్రబాబు ప్రస్తావన వస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు పై, చంద్రబాబు పార్టీపై తన వైఖరిని బల్లగుద్ది నట్టు చెబుతున్నారు. తనకు చంద్రబాబుతో లింకు పెట్టి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతా అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

తెలంగాణలో టీడీపీ లేదు, బాబుకు ఇక్కడ పని లేదు : రేవంత్ వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీనే లేదని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రణాళిక లేదని రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబుకు తెలంగాణలో పని లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభిమతం మేరకే తాను టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పిన రేవంత్ రెడ్డి రాజకీయ విలువలను తాను గౌరవిస్తున్నారని, చంద్రబాబుతో విభేదాలతో తాను బయటకు రాలేదని, పదవులు ఆశించి భంగపడి బయటకు రాలేదని చెప్పుకొచ్చారు. అసలు తాను చంద్రబాబును తిట్టాల్సిన అవసరం ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తిట్టలేదు కాబట్టి తాను చంద్రబాబు మనిషి అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని చంద్రబాబుని తానెందుకు తిట్టాలో చెప్పాలని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి తాను సోనియాగాంధీ మనిషినని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినని చెప్పుకొచ్చారు.
Recommended Video

చంద్రబాబు ముద్రను తొలగించుకునే పనిలో రేవంత్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో టిడిపి నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు సైతం ఈ వ్యాఖ్యలు మింగుడుపడని విధంగానే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి తనపై టిఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే వేస్తున్న చంద్రబాబు ముద్రను తొలగించుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పార్టీ పట్ల తన వైఖరిని స్పష్టంగా చెప్పి, తాను ప్రభుత్వ వైఫల్యాలపై, చేస్తున్న అవినీతిపై మాట్లాడితే వాటిని నిరూపించుకోవాల్సింది పోయి చంద్రబాబు పేరు తెచ్చి టార్గెట్ చెయ్యటం చేతకానితనం అని నిప్పులు చెరుగుతున్నారు. తనపై మున్న బాబు ముద్ర పోగొట్టుకునేందుకు గట్టిగానే డిఫెండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications