మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి, అక్కడే బిగ్ ట్విస్ట్: ఇన్- అవుట్ వీరే...!?
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నారేళ్లు పూర్తి కావటంతో.. మంత్రివర్గంలో మార్పులు చేయాలని.. కొత్త వారికి అవకాశం ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని తప్పించటం ఖాయం గా కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిగాయి. ఇక.. శాఖల వారీగా మార్పులు తప్పదని తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం సైతం దాదాపు ఖరారు అయింది.
తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మంత్రి వర్గంలో మార్పుల పైన చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు... కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో దక్షిణాది పైన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో ప్రభుత్వం.. పార్టీలో అవసరమై నిర్ణయాలకు కాంగ్రెస్ నాయకత్వం సిద్దమైంది. కాగా,
రేవంత్ కేబినెట్ లో ముగ్గురు కొత్త మంత్రులు కొలువుదీరుతారని చెబుతున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటుపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశమని, అది ఎవరనేదీ రాష్ట్ర నాయక త్వం తేల్చుకోవాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక.. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌కు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించి నా.. ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

మంత్రివర్గంలో మార్పులు - చేర్పులు
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే బాలూ నాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవి ఆశిస్తున్నారు. చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా.. ఆయన మంత్రిపదవి కోరుకుంటూ, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సైతం మంత్రి వర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అదే విధంగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముగ్గురు మంత్రుల పనితీరు పట్ల అధిష్ఠానం అసంతృప్తిగా ఉందని.. అందులో ఇద్దరు మంత్రులను తప్పించవచ్చని చెబుతున్నారు. పార్టీ పదవులకు భర్తీ చేయనున్నారు. దీంతో.. ఆశావాహుల్లో ఈ నియామకాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications