అంతర్గత పోరులో నిలబడ్డ రేవంత్ రెడ్డి; చతికిలబడ్డ బండి సంజయ్!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామాలు జరిగాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఇద్దరు రాష్ట్ర రాజకీయాలను మార్చాలని బరిలోకి దిగి దూకుడుగా పనిచేశారు. ఇద్దరు దూకుడుగా పాదయాత్రలు చేసి, అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహించి ప్రజల మద్దతును పొందే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇద్దరూ బరిలోకి దిగినా ఊహించనివిధంగా బండి సంజయ్ అవుటయ్యారు.
ఆదినుంచి సీనియర్ నాయకుల తీవ్ర వ్యతిరేకత మధ్య రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీలో అడుగడుగునా సీనియర్లు ఆయనకు సహకరించకపోయినా, అధిష్టానానికి ఫిర్యాదు చేసినా, రేవంత్ రెడ్డితో కలిసి పనిచెయ్యం అని తేల్చి చెప్పినా, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్ళినా సరే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించి ముందుకు సాగారు.

అనేకసార్లు కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రేవంత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు, బాహాటంగా సీనియర్ నాయకులు చేసిన విమర్శలు రేవంత్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారు అన్న చర్చకు కారణమైనా అధిష్టానం రేవంత్ రెడ్డి పై పూర్తి విశ్వాసంతో ఆయననే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగించింది.
తెలంగాణలో రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలోనూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన కొందరు ఆ కార్యక్రమానికి హాజరు కాబోమని అల్టిమేటం జారీ చేసినా సరే రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం పూర్తి విశ్వాసాన్ని ఉంచింది. ఫలితంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పలువురు ముఖ్య నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకుంది.

అంతర్గతంగా ఎన్ని కలహాలు ఉన్నా ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రస్తుతం అంగీకరించ వలసిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డిని ఊపేసిన వ్యతిరేకత ఆయనను మాత్రం అధ్యక్ష పదవి నుండి కదిలించలేక పోయింది. ఇదిలా ఉంటే తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఏకతాటి మీద నడిపిస్తాడు అని భావిస్తే, మొదట్లో బాగానే ఉన్నా తర్వాత క్రమంలో మొదలైన అంతర్గతపోరు అధ్యక్షుడిగా తొలగించేలా చేసింది.

బండి సంజయ్ ఒంటెత్తు పోకడలను, అంతర్గత కలహాలను సీరియస్ గా తీసుకున్న బిజెపి అధినాయకత్వం అధ్యక్షుడిగా ఆయనను పక్కనపెట్టి కిషన్ రెడ్డికి పట్టం కట్టింది. ఇక అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తారు అనుకున్న రేవంత్ రెడ్డి నిలదొక్కుకుంటే, వచ్చే ఎన్నికలకు రథసారధిగా వ్యవహరిస్తారు అనుకున్న బండి సంజయ్ అంతర్గత పోరు లో చతికిల పడ్డారు.












Click it and Unblock the Notifications