దున్నపోతులతో, గొర్రె పొట్టేళ్లతో గాంధీభవన్ ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డికి వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి వాడెంత.. వాడి బతుకెంత.. పిసికితే ప్రాణం పోతుంది అంటూ నానా దుర్భాషలాడారు.
ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి తలసాని మొదటినుంచి దున్నపోతులతో కలిసి తిరిగే వాడని, దున్నపోతులను కాసేవాడని, తనను తాను దున్నపోతుల అనుకోవడం వల్లే నోటికొచ్చింది మాట్లాడాడని ఎద్దేవా చేశారు. మొదటినుంచి పేడ పిసుక్కున్న అలవాటు ఉన్న తలసాని పిసుకుడు గురించి వ్యాఖ్యలు చేశాడని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చురకలంటించారు.

కెసిఆర్ కాళ్లు పిసికి నట్టు కాదు తనను పిసకడం అని పేర్కొన్న రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై నిప్పులు చెరిగారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రేవంత్ రెడ్డి 24 గంటల లోపు యాదవుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తిరిగి వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
యాదవులను వృత్తిని అవమానించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, రాజనీతి శాస్త్రం తెలియని ఒక రౌడీ నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక యాదవ మంత్రిని ఆర్థిక, కుల అహంకారంతో దూషించారని గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

ప్రపంచానికి అన్నం పెట్టిన వారు యాదవులని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పౌష్టికాహారాన్ని అందించి ఉత్పత్తిదారులు యాదవులని అన్నారు. కృష్ణుని వారసులు, పశు పాలకులు, పరిపాలకులు కూడా యాదవులని పేర్కొని తక్షణ యాదవ సమాజాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి బేషరతుగా యాదవులకు క్షమాపణ చెప్పాలన్నారు.
లేనిపక్షంలో గొల్లకురుమల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని దున్నపోతులతో, గొర్రె పొట్టేళ్ళ తో గాంధీ భవన్ ముట్టడిస్తామని గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. యాదవ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications