బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీరియస్:కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి అల్టిమేటం!
ఢిల్లీ: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను అభ్యర్థించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (GWDT-1980), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 నిబంధనలను ఉల్లంఘిస్తోందని వారు కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు.
ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జలశక్తి మంత్రి, ఆ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో గురువారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలు, రైతుల్లో నెలకొన్న ఆందోళనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ గోదావరి వరద జలాల ఆధారంగా చేపడుతున్నామని చెబుతోందని, అయితే GWDT-1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని సీఎం గుర్తుచేశారు.

నిబంధనల ఉల్లంఘన.. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఎక్కడ?
2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే ముందుగా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (CWC), ఆపై జలశక్తి మంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల విషయంలో ఏపీ ఈ నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తోందని సీఎం ఆరోపించారు. వరద జలాల పేరుతో నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టు చేపట్టడం అభ్యంతరకరమన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం,ఇతర ప్రాజెక్టులపైనా చర్చ
పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను CWC అనుమతులు లేకుండానే ఏపీ చేపట్టిందని సీఎం వివరించారు. పోలవరం డిజైన్లను GWDT-1980 నిబంధనలకు విరుద్ధంగా మార్చారని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. తమ అభ్యంతరాలు ఉన్నా పనులు కొనసాగిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టయిన పోలవరంలో నిబంధనల ఉల్లంఘన జరగకుండా కేంద్రం దృష్టి సారించాలని కోరారు.
తెలంగాణకు 1500 టీఎంసీల అనుమతి ఇవ్వాలి:
గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు కలిపి మొత్తం 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నుండి నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహెట్టిలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. మూసీ పునరుజ్జీవనానికి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.
సమావేశం తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎ.పి. జితేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications