తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రేవంత్ అలా ఎందుకన్నారో..?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. రాహుల్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ఆదేశాలను పాటిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బహిరంగ సభ ఉంటుందని, దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు చెప్పారు. తెలంగాణ కులగణనపై సమగ్రంగా రాహుల్ గాంధీకి వివరించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

రాజకీయ కోణంలో కాదు.. ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలను ఉద్రేకపరిచే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయన్నారు. సర్వేలో ఎక్కడా తప్పు జరగలేదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు పంపిస్తామని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నడిచుకుంటామన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడని సీఎం రేవంత్ అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారని రేవంత్ ప్రశ్నించారు. ఇక, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను కొందరికి నచ్చకపోవచ్చని.. తనను కొందరు అంగీకరించకపోవచ్చని సీఎం రేవంత్ అన్నారు. కానీ, తన పని తాను చేస్తున్నట్లు చెప్పారు. తనను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని అన్నారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది తాను.. అమలు చేయకపోతే అడిగేది తననే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఏమనుకున్నా.. ఎలాంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా రాహుల్-రేవంత్ భేటీతో అదంతా అసత్యమేనని తేలిపోయింది.












Click it and Unblock the Notifications