గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్
తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. వారికి ప్రతి నెలా రూ. 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది. వారందరికీ ప్రతి నెలా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని, వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం రేవంత్ చెప్పారు.
కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు ధనసరి సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దు
సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. జనవరి 14న ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్. జనవరి 15, 16 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్నారు. 15న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. జనవరి 17న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 17, 18 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. 19న సింగపూర్ నుంచి దావోస్ వెళ్లి.. 23 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంవో వెల్లడించింది.












Click it and Unblock the Notifications