కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి .. అయినా కేసు నుండి బయటపడతాడా ?
తెలంగాణా సీఎం కేసీఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజకీయంగా బద్ద శత్రువులు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ రేవంత్ రెడ్డి తలపడ్డాడు. కేసీఆర్ ని గద్దె దించుతామని సవాల్ చేసిన రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా ఓటమిపాలయ్యాడు.ఆ షాక్ తో చాలా రోజుల పాటు సైలెంట్ అయిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడటానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. కేసీఆర్ తరహా మైండ్ గేమ్ తో విజయం సాధిస్తాం అనుకున్న రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, జాతకాలు, వాస్తులు అంటూ కేసీఆర్ బాట పట్టిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు నుండి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్నారు. పూజలు పురస్కారాలతోనే కేసీఆర్ అన్ని సాధిస్తున్నారని భావిస్తున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ తరహా యాగాలు, పూజలు ఫలితాలనిస్తాయా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

రేవంత్ రెడ్డికి చేతికి మంత్రించిన ఒక వెండి బ్రాస్ లెట్ ... రీజన్ ఇదే
తెలంగాణాలో ఫైర్ బ్రాండ్ లా ఎప్పుడూ చిటపటలాడే రేవంత్ రెడ్డి ఈ మధ్య చాలా రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డికి చేతికి మంత్రించిన ఒక వెండి బ్రాస్ లెట్ ఉండటంతో అది చూసిన మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి తో మాట్లాడిన మీడియా ప్రతినిధులకు ఆయన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన ఓటమికి గల కారణాలపై జ్యోతిష్యులను అడిగి తెలుసుకున్నానని,ఇంటికి వాస్తు దోషాలు కూడా ఉన్నట్టు గుర్తించి వాస్తు దోషాలను సరి చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు ఇటీవల మూడు రోజులపాటు సుదర్శన హోమాన్ని తన ఇంట్లో నిర్వహించామని చెప్పిన రేవంత్ రెడ్డి మూడు రోజులపాటు నిష్ఠగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నానని చెప్పారు. అంతేకాదు నిష్ఠగా పూజాదికాలు నిర్వహించానని చెప్పిన రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు గా ఆయన చెప్పినదాన్ని బట్టి అర్థమవుతుంది.

ఓటుకునోటు కేసుతో సుదర్శన,శాంతి హోమాలు చేసిన రేవంత్ రెడ్డి
అయితే తాజాగా ఓటుకు నోటు కేసు తెరమీదకు రావడంతో ఈ కేసు నుండి బయట పడటం కోసం రేవంత్ రెడ్డి ఇంట్లో శాంతి పూజలు నిర్వహించారని బయట చర్చ జరుగుతోంది. మూడు రోజుల పాటు సుదర్శన హోమం నిర్వహించిన రేవంత్ రెడ్డిలో భగవంతుని పట్ల ఇంతగా భయభక్తులు ఏర్పడతాయని ఎవరూ ఊహించలేదు. కానీ కేసీఆర్ పుణ్యమాని ఆయనలో కూడా ఆధ్యాత్మికత కనిపిస్తుంది. అంతేకాకుండా వాస్తు దోషాలను కూడా సరి చేయించిన రేవంత్ ఇంటి ప్రధాన ద్వారానికి మార్పులు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమాల్లోనే రేవంత్ చేతికి మంత్రించిన వెండి బ్రాస్ లెట్ ఇచ్చి ధరించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ లా యాగాలు చేస్తే రేవంత్ కేసుల నుండి గట్టెక్కుతారా
నిన్న మొన్నటి దాకా కేసిఆర్ యజ్ఞాలు,యాగాల పైన పరుష పదజాలంతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ మార్గాన్ని ఎంచుకున్నారు. సమయం అనుకూలంగా లేనప్పుడు భగవంతుని దయ ఉండాలంటూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఆధ్యాత్మిక కార్యక్రమాలను కానీ, వాస్తు సంబంధిత నమ్మకాలను కానీ పక్కన పెట్టలేదు. అవే కేసీఆర్ ని గెలిపించాయనే భావన కూడా రాజకీయ నాయకులకు ఉంది. అందులో భాగంగానే బద్ధశత్రువైన కేసీఆర్ బాటలో నడిచి తన కష్టాల నుండి గట్టెక్కాలి అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.మరి ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications