వరంగల్ ఉపఎన్నిక: బీజేపీ, టీడీపీల మధ్య చిచ్చు పెడుతుందా?
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్ధానానికి జరగనున్న ఉపఎన్నిక బీజేపీ, టీడీపీల మధ్య చిచ్చుపెట్టేలా ఉంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశాన్ని తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి బీజేపీ పోటి చేసి ఓటమి పాలైంది.
ఈ లోక్‌సభ స్ధానం నుంచి ఎంపీగా ఎన్నికైన కడియం శ్రీహరి రాజీనామాతో ఈ స్ధానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ నెలాఖరులోగా ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న సమాచారంతో తెలంగాణ తెలుగుదేశంలో రాజకీయం ఊపందుకుంది.
సమాచారం మేరకు, ఈ స్ధానంలో తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తున్నారంట. ఎంపీగా ఆయన గెలిస్తే, టీడీపీ నుంచి అత్యంత సీనియర్ కావడంతో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తే, ఈయనకు మంత్రి దక్కొచ్చని అంచనా వేస్తున్నారు.

గతంలో కూడా మోత్కుపల్లికి టీడీపీ తరుపున గవర్నర్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రస్తావన రాలేదు. దీంతో ఉపఎన్నికలను అవకాశంగా భావిస్తున్న ఆయన తనకే ఎంపీగా టికెట్ ఇవ్వాలని పార్టీలోని కొందరు నేతల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం.
తెలంగాణ టీడీపీలో తక్కువ కాలంలో మంచిపేరు తెచ్చుకున్న కొందరు నాయకులు సీనియర్లకు మోకాలడ్డుతున్నారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ ఎంపీ స్ధానం ఎస్సీకి రిజర్వుడు స్ధానమైన మోత్కుపల్లి వంటి సీనియర్లకు అవకాశం దక్కకుండా కొందరు జూనియర్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
సీనియర్లకు అవకాశం కల్పిస్తే తమ ప్రాధాన్యం ఎక్కడ తగ్గిపోతుందోనన్న ముందుచూపుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు. వరంగల్ ఎంపీ స్థానాన్ని బీజేపీకే వదిలేద్దామని, ఈరోజు కాకపోయినా, రేపైనా సనత్‌నగర్‌కు ఉపఎన్నిక తప్పదని, అక్కడే పోటీ చేద్దామని కొందరు ప్రతిపాదిస్తున్నారంట.
మరోవైపు వరంగల్ లోక్‌సభ స్ధానానికి తమ నుంచి సరైన అభ్యర్థి లేడని, వరంగల్ స్థానాన్ని టీడీపీకి వదిలేసి, సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక జరిగితే తాము పోటీ చేస్తామని బీజేపీ కొత్త ప్రతిపాదన చేసిందని సమాచారం.












Click it and Unblock the Notifications