రోహిత్ సూసైడ్‌ను వక్రీకరించొద్దు, దత్తాత్రేయే కాదు.. వీహెచ్ కూడా లేఖ: స్మృతి
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వేముల రోహిత్ ఆత్మహత్య విషయాన్ని వక్రీకరిస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం అన్నారు. వర్సిటీలో దళితులు, దళితేతరుల మధ్య వివాదం కానే కాదని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే విశ్వవిద్యాలయం కమిటీని నియమించిందన్నారు.
కమిటీ నివేదిక మేరకే విశ్వవిద్యాలయం అయిదుగురు విద్యార్థుల పైన చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థుల సస్పెన్షన్ పైన స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందని కేంద్రమంత్రి స్మృతి చెప్పారు. రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరమని స్మృతి ఇరానీ అన్నారు.
తన సూసైడ్ నోట్‌లో రోహిత్ వేముల ఎవరి పేర్లను ప్రస్తావించలేదని ఆమె గుర్తు చేశారు. రోహిత్ మృతి పైన వాస్తవాలను వక్రీకరించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు మాట్లాడుతున్నారని, ఇది బాధాకరమన్నారు. ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదన్నారు.
రోహిత్‌ను సస్పెండ్ చేసింది కేంద్రం ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కాదని చెప్పారు. రోహిత్ మృతి దురదృష్టకరమని చెప్పారు. రోహిత్ తన సూసైడ్ నోట్లో ఏ ఎంపీ పేరును లేదా ఏ కేంద్రమంత్రి పేరును లేదా ఏ ఆర్గనైజేషన్ పేరును లేదా ఏ ప్రొఫెసర్ పేరును ప్రస్తావించలేదన్నారు.

దత్తాత్రేయే కాదు.. వీహెచ్ లేఖ పైనా అలాగే స్పందించాం
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ... వేముల రోహిత్ రాసిన సూసైడ్ నోట్‌ను కొంత చదివి వినిపించారు. స్థానిక సమస్యల విషయమై లేఖలు పంపించడం.. కేవలం బండారు దత్తాత్రేయ మాత్రమే చేయలదేన్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ వి హనుమంత రావు కూడా లేఖ రాశారని చెప్పారు.
17 నవంబర్ 2014 కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి హనుమంత రావు యూనివర్సిటీలోని హత్యల పైన కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. విహెచ్ లేఖ పైన వ్యవహరించినట్లుగానే దత్తాత్రేయ లేఖ పైన కూడా వ్యవహరించామని చెప్పారు.
బండారు దత్తాత్రేయ లేఖను హెచ్‌సియుకు నాలుగైదుసార్లు పదేపదే పంపించారని, తద్వారా వర్సిటీ పైన ఒత్తిడి చేశారని స్మృతి ఇరానీ పైన ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె స్పందించారు. విహెచ్ లేఖను కూడా వర్సిటీకి ఆరుసార్లు పంపించామని చెప్పారు.
దత్తాత్రేయ లేఖ పైన ఎలా వ్యవహరించామో విహెచ్ లేఖ పైన కూడా అలాగే వ్యవహరించామన్నారు. ఇరువురి లేఖను పలుమార్లు వర్సిటీకి పంపించామని చెప్పారు. ప్రతి లేఖ పైన మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుందన్నారు. నిజనిర్ధారణ కమిటీ సాయంత్రం ఢిల్లీకి వస్తుందన్నారు.

ఆత్మహత్యపై విచారణ జరుగుతోందన్నారు. నిష్పక్షపాత విచారణ జరుగుతోందన్నారు. విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల ఆత్మహత్యలు, భూముల ఆక్రమణ తదితర అంశాల పైన విహెచ్ సుదీర్ఘ లేఖ రాశారని చెప్పారు. గతంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాశారన్నారు.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చేయవద్దన్నారు. తద్వారా విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టవద్దన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలోను జరిగాయని, కొత్త కాదన్నారు. జనవరి 17న రోహిత్ మృతి చెందినట్లు సమాచారం అందిందని చెప్పారు.
రెండు లేఖలు (విహెచ్, బండారు దత్తాత్రేయ) యూనివర్సిటీకి పంపించడం తన బాధ్యత అన్నారు. ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ పైన దాడి జరిగినట్లు అతని తల్లి హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఎవరైనా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దన్నారు.
దత్తాత్రేయకు నక్వీ క్లీన్ చిట్
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు బిజెపి నేతలు క్లీన్ చిట్ ఇస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ.. రోహిత్ ఆత్మహత్య ఘటనపై స్పందించారు. దత్తాత్రేయ ఇన్నోసెంట్ అన్నారు. తమ ప్రభుత్వం అతనికి అండగా ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications