ఈడీ అరెస్ట్ ను సవాల్ చేసిన ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాక్!!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే తన అరెస్ట్ అక్రమమని, న్యాయపోరాటం చేస్తానని పదేపదే ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఈడి అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత హౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, కవిత వాదనను కొట్టివేశారు.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పి ఎం ఎల్ ఏ చట్టంలోని సెక్షన్ 19ను పాటించారని హౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ తీర్పు ఇచ్చినట్టు సమాచారం. అలాగే కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్టు చేయడంతో పాటు 24 గంటల్లోపు న్యాయస్థానం ముందు హాజరు పరిచారని న్యాయస్థానం వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత సోమవారం నాడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఈడి అధికారులు తనను అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు రాకుండానే ఈడీ అరెస్టు చేసిందని కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈడి చర్యలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని, ఈ కేసుకు సంబంధించి తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. శుక్రవారం నాడు ఈ కేసు సుప్రీం ధర్మాసనం ముందుకు రానున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు దీనిపై ఏం తీర్పు ఇస్తుంది అనేది అందరిలోనూ ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications