హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.95 కోట్లు స్వాహా..!
డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. హ్యాకింగ్, ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాలు దాడులు సాధారణమైపోతున్న ఈ కాలంలో ఇప్పుడు "డిజిటల్ అరెస్ట్" అనే కొత్త మోసం ప్రజలను వణికిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో "డిజిటల్ అరెస్ట్" మోసం కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.
ఏం జరిగిందంటే..?
ప్రభుత్వ, టెలికాం శాఖల అధికారులమంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేశారు. ఆమె భర్త తీవ్రమైన నేరాల్లో చిక్కుకున్నాడని, వెంటనే అరెస్ట్ చేయబోతున్నామని బెదిరించి ఆమె వద్ద నుంచి రూ. 1.95 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ మేరకు డిసెంబర్ 13న మహిళ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ఇద్దరు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయబ్ జాహిద్ భాయ్, బేలిమ్ అనస్ రహీమ్ భాయ్‌గా గుర్తించారు.

కాగా కరెన్సీ సీరియల్ నంబర్ల వెరిఫికేషన్, కేసు విచారణ, క్లియరెన్స్ ప్రక్రియల పేరుతో వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు పలు దఫాలుగా రూ. 1,95,76,000 బదిలీ చేసింది. ఈ మోసంలో జాహిద్ భాయ్ నకిలీ బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్) తెరిపించి.. వాటి ద్వారా వచ్చిన డబ్బులో 15 శాతం కమీషన్ తీసుకునేవాడని పోలీసులు తెలిపారు.
ఇక రహీమ్ భాయ్, దుబాయ్‌లో ఉన్న ప్రధాన సూత్రధారుల ఆదేశాల మేరకు హవాలా మార్గంలో డబ్బును బదిలీ చేసేవాడని డీసీపీ వి. అరవింద్ బాబు వివరించారు. నిందితులు వృత్తిరీత్యా సైబర్ నేరగాళ్లని..వీరు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా మొత్తం 22 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ. 3.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే డిస్‌కనెక్ట్ చేసి.. పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఎటువంటి సందర్భంలోనూ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ సమాచారం, డబ్బులు ఇవ్వకూడదని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.












Click it and Unblock the Notifications