500 నోట్లు వచ్చేశాయ్: నేటి నుంచి ఏటీఎంలలో పొందవచ్చు
బుధవారం తెలుగు రాష్ట్రాలలోని బ్యాంకులకు రూ. 500 నోట్లు చేరుకున్నాయి. ఇప్పటి వరకు రూ. 2వేల నోట్లను మాత్రమే పొందిన ప్రజలు.. ఏటీఎంల నుంచి ఇక రూ. 500 నోట్లను కూడా తీసుకోవచ్చు.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరటనిచ్చే వార్త. బుధవారం తెలుగు రాష్ట్రాలలోని బ్యాంకులకు రూ. 500 నోట్లు చేరుకున్నాయి. ఇప్పటి వరకు రూ. 2వేల నోట్లను మాత్రమే పొందిన ప్రజలు.. ఏటీఎంల నుంచి ఇక రూ. 500 నోట్లను కూడా తీసుకోవచ్చు.
హైదరాబాద్ నగరానికి మంగళవారం పొద్దుపోయిన తర్వాత రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఈ నోట్లను అన్ని బ్యాంకులకు విడుదల చేసింది. అయితే వీటిని బ్యాంకుల్లో ఖాతాదారులకు ఇవ్వవద్దని, కేవలం ఏటీఎంల ద్వారానే పంపిణీ చేయాలని కోరింది.

హైదరాబాద్‌లోని బ్యాంకులకు దాదాపు రూ.100 కోట్ల వరకు రూ.500 నోట్లు వచ్చి ఉంటాయని అధికారులు తెలిపారు. రూ.2000 నోటు మాదిరిగా రూ.500 నోటు కూడా కాస్త చిన్న సైజులో ఉండటంతో వీటిని ఏటీఎంలో అమర్చాలంటే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
ఈ మార్పుల అనంతరం గురువారం నుంచి ఏటీఎంల్లో ఈ నోటు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఓ సీనియర్ బ్యాంకు అధికారి వెల్లడించారు. రిజర్వు బ్యాంకు నుంచి రూ.500 నోట్లు కొద్ది మొత్తమే వచ్చాయని, వాటినే అన్ని బ్యాంకులకు సర్దుబాటు చేశారని ఈ అధికారి చెప్పారు.
మరో వారం రోజుల్లో మరిన్ని రూ.500 నోట్లు వస్తాయని రిజర్వు బ్యాంకు అధికారులు తెలిపారని చెప్పారు. ఈ నోట్లు అందుబాటులోకివస్తే రెండువేల నోట్ల మార్పిడికి ఇబ్బంది తప్పుతుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications