టీఆర్ఎస్‌కు కీలక నేత గుడ్‌బై... కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన సామ వెంకట్ రెడ్డి...
టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత సామ వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సామ వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్‌తో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కనీస వేతనాల బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. బుధవారం(జులై 21) ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను వెంకట్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ప్రైవేట్ సెక్టార్‌లోనూ స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించేలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు రానప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఏం లాభమని ప్రశ్నించారు.

ప్రైవేట్ సెక్టార్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్ అమలుచేయాలన్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన కరువైందన్నారు. పరిశ్రమలు,పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా ఉండటం తప్ప ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ఇంజనీరింగ్ చదివిన యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
Recommended Video

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్‌లో తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు లోనవుతున్నారని అన్నారు.టీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారులు విసుగు చెందే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో... ఆ ఆశయాలను పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సామ వెంకట్ రెడ్డి కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌తో పనిచేస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications