అల్లు అర్జున్‌పై కేసు నమోదు: సంధ్య థియేటర్ క్లోజ్!
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun), ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదైంది. ఈ మేరకు వివరాలను గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. సంధ్య థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 105, 118 బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో వేయడంతో భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అభిమానులతోపాటు సినిమాలో నటించిన నటులు వస్తారనే కీలక సమాచారం తమకు ఇవ్వలేదని డీసీపీ తెలిపారు. మరోవైపు, థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. అంతేగాక, ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోలేదన్నారు.

సినిమా చూసేందుకు వచ్చిన ప్రజలను అదుపుచేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదని డీసీపీ తెలిపారు. బుధవారం రాత్రి 9.40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టివేశారు.
అప్పటికే థియేటర్ లోపల, బయట అభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయింది. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసులు వెంటనే బయటకు తీసుకొచ్చారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లగా రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ ఘటనపై రేవతి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, బుధవారం రాత్రి పుష్ప-2 (Pushpa-2) సినిమా ప్రీమియర్ షోను సంధ్య థియేటర్‌లో వేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్.. సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక, అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో తెలియజేయకుండా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలో సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేసినట్లు డీసీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications