ఆ విషయంలో.. అవసరమైతే కేసీఆర్‌ను చంద్రబాబుతో మాట్లాడిస్తా : కేటీఆర్
హైదరాబాద్ : గుంటూరులో మెడిసిన్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో మూడు నెలల్లో మెడిసిన్ పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిన బిడ్డ.. ఇలా అర్ధాంతరంగా బలైపోవడం కన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఆశ్రయించారు ఆమె కుటుంబ సభ్యులు. సంధ్యారాణిని లక్ష్మి ఎంతటి వేధింపులకు గురిచేసిందో.. ఈ సందర్బంగా కేటీఆర్ కు వివరించారు. లక్ష్మి వేధింపులపై సంధ్యారాణి రాసిన సూసైడ్ నోట్ ను కేటీఆర్ కు చూపించారు.
సంధ్యారాణి కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థంచేసుకున్న మంత్రి కేటీఆర్.. తక్షణం ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఫోన్ చేశారు. సంధ్యారాణి కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందిగా కోరారు. కేటీఆర్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రి కామినేని, సంధ్యారాణి మృతికి కారకులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

ప్రొఫెసర్ లక్ష్మితో పాటు ఆమె భర్తపై కూడా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ఆయన చేస్తున్న ఉద్యోగం నుంచి తప్పించేలా చర్యలుంటాయని కామినేని తెలిపినట్టు సమాచారం. అనంతరం ఏపీ డీజీపీని కూడా ఫోన్ ద్వారా సంప్రదించారు కేటీఆర్. పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
నిందితురాలిని పట్టుకుని తీరుతామని, దీనిపై మంత్రి కామినేనితో చర్చించామని సాంబశివరావు పేర్కొన్నారు. సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన వారికి శిక్ష పడేందుకు.. అవసరమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడించడానికి ప్రయత్నిస్తానని కేటీఆర్ హామి ఇవ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications