నాకేమీ తెలియదు: సండ్రకు 70 ప్రశ్నలు సంధించిన ఎసిబి
హైదరాబాద్: తాను ఎమ్మెల్యేను, ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని కాబట్టి తనకు ప్రతిరోజు ఎన్నో ఫోన్లు వస్తుంటాయని, అందులో సగంమందిని చూస్తేగానీ గుర్తుపట్టలేని పరిస్థితి అని ఓటుకు నోటు కేసులో నిందితుడైన సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. మహానాడు బిజీలో ఎవరు ఫోన్ చేశారో కూడా గుర్తు పెట్టుకోలేదని ఆయన అన్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా గురువారం ఉదయం ఏసీబీ అధికారులు సండ్రను చర్లపల్లి జైలులో అదుపులోకి తీసుకున్నారు.
కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం 9.30 గంటలకు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ శివశంకర్ నేతృత్వంలో డీఎస్పీ, ఇతర అధికారులు సండ్రను ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వేం నరేందర్ నుంచి సేకరించిన సమాచారం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఆధారంగా ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం వివరాలు ఆరా తీశారు.

ముఖ్యంగా సెబాస్టియన్‌తో జరిగిన ఫోన్ సంభాషణ, డబ్బులపైనే అధికారులు ఎక్కువ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఎమ్మెల్యేగా ఉన్న తనకు ప్రతిరోజు ఎంతోమంది ఫోన్ చేస్తుంటారని, వారిలో చాలామందిని ప్రత్యక్షంగా చూస్తేగానీ గుర్తుపట్టలేనని సండ్ర వివరించారు. పార్టీలో సహచరులకు ఫోన్ చేయడం, వారు తనకు ఫోన్ చేయడం సహజమేనని, ఫోన్ సంభాషణలకు, తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేదని తెలిపారు.
తొలుత సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేసినప్పుడు ఎందుకు విచారణకు రాలేదని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అనారోగ్యం వల్లే రాలేకపోయానని సండ్ర బదులిచ్చారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తెచ్చిన రూ. 50 లక్షలు, ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రూ.4.5 కోట్ల విషయమై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
ఆ విషయాలేవీ తనకు తెలియదని సండ్ర స్పష్టం చేసినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. తొలిరోజు కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి... రాత్రి బస నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు.
ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సండ్ర ఎక్కడా తడబడకుండా సమాధానాలిచ్చారని, మధ్యాహ్నం భోజనం, టీ తీసుకున్నారని, వెన్ను నొప్పితో బాదపడుతున్నందున కొంత ఇబ్బందికి గురయ్యారని సండ్ర తరఫు న్యాయవాది సుధీర్ కుమార్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏసీబీ కార్యాలయాలు ఒకే దగ్గర ఉండటంతో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందునే ఆయనను సిట్ కార్యాలయానికి తరలించారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications