• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బతుకమ్మ వేడుకల్లో విషాదం... యువకుడి మృతి... చెరువులో నిమజ్జనం చేస్తుండగా...

|

సంగారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. స్థానికులు అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే... జిల్లాలోని పుల్కల్‌లో బుధవారం(అక్టోబర్13) సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. స్థానికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు.ఆట,పాటల అనంతరం అంతా కలిసి ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్లారు.చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తున్న సమయంలో శేఖర్ అనే స్థానిక యువకుడు కాలు జారి అందులో పడిపోయాడు.అక్కడే ఉన్న కొంతమంది వెంటనే అతన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేరు.దీంతో అక్కడి నుంచి సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని శేఖర్ తల్లిదండ్రులు ఆరోపించారు.పండుగపూట సంతోషంగా గడుపుతున్న సమయంలో అనుకోని ఈ ఘటన శేఖర్ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది.

sangareddy youth died after fell into pond while immersing bathukamma

ఖాళీ బిందెల చుట్టూ బతుకమ్మ ఆడుతూ మహిళల నిరసన :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చలమన్న నగర్‌కి చెందిన మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఖాళీ బిందెల చుట్టూ బతుకమ్మ ఆడి నిరసన తెలియజేశారు.గత 15 రోజులుగా ఇక్కడ తాగునీరు రావట్లేదు.దీంతో స్థానికులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు.దీంతో ఖాళీ బిందెల చుట్టూ బతుకమ్మ ఆడి తమ నిరసన తెలిపారు.పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా ఇటీవల హుజురాబాద్‌లో స్థానిక మహిళలు సిలిండర్ల చుట్టూ బతుకమ్మ ఆడిన సంగతి తెలిసిందే. అయితే బతుకమ్మను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలు వినిపించాయి.

కొన్ని చోట్ల నిన్న,మరికొన్నిచోట్ల ఇవాళ సద్దుల బతుకమ్మ :

తెలంగాణలో బతుకమ్మ,దసరా పండుగలను అత్యంత పెద్ద ఎత్తున నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.ప్రకృతి పూలను ఆరాధించే అరుదైన,విశిష్ఠమైన పండుగ బతుకమ్మ.ఎంగిలిపూల బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ,వెన్న ముద్దల బతుకమ్మ,సద్దుల బతుకమ్మ.. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి.

చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు సాయంత్రం బతుకమ్మని పేర్చి ఆటపాటలతో వేడుక జరుపుకుంటారు. అనంతరం బతుకమ్మని తలపై పెట్టుకుని ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్తారు. అక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత సత్తు ముద్దల ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచిపెడుతారు.

సాధారణంగా రాష్ట్రమంతా ఒకేరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి.కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో కొన్నిచోట్ల బుధవారం,మరికొన్నిచోట్ల గురువారం ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి నాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా, కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు.అయితే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకునేవారు గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు.

English summary
A tragic incident took place during the Saddula Bathukamma celebrations in Sangareddy district. A young man accidentally fell into the pond while immersing Bathukamma. The locals pulled him out and rushed him to the hospital. He died on the way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X