సారిక కేసు: థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా.. కస్టడీకి రాజయ్య కొడుకు అనిల్
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యులు రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవదహనం కేసులో ప్రధాన నిందితుడు సిరిసిల్ల అనిల్ కుమార్‌ను విచారించేందుకు పోలీసులకు న్యాయస్థానం మంగళవారం నాడు అనుమతి ఇచ్చింది.
అతనిని రెండు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. అనిల్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ హన్మకొండ ఏసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని స్థానిక న్యాయస్థానం పరిశిలించింది.
కొన్ని నిబంధనలతో అనుమతిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనిల్ కుమార్‌ను కస్టడీకి తీసుకు వెళ్లే ముందు, కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలని, విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని, నిందితుడి న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశించింది.

కోర్టు అనుమతి ఇవ్వడంతో బుధవారం, గురువారం సారిక భర్త అనిల్ కుమార్‌ను విచారించనున్నారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, అలాగే గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారిస్తారు.
మరోవైపు రాజయ్య, ఆయన భార్య మాధవి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తుపై బుధవారం రెండో అదనపు జిల్లా కోర్టు విచారించనుంది. ప్రస్తుతం రాజయ్య సహా కుటుంబసభ్యులు, రెండో కోడలు సనా వరంగల్ సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.












Click it and Unblock the Notifications