సుప్రీం తాజా తీర్పు: తలసాని సహా తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు సేఫ్
హైదరాబాద్: సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పును బట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి ఫిరాయించిన పది మంది శాసనసభ్యులకు ఏ విధమైన ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదు. వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించే అవకాశం లేదు.
మూడింట రెండు వంతుల మెజారిటీ అనే విషయాన్ని పక్కన పెట్టినా ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమవుతుందని సుప్రీంకోర్టు తాజా తీర్పును బట్టి అర్థమవుతోంది. ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే అంశాలపై గవర్నర్‌కు ఎలాంటి అధికారం ఉండదని, అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర గవర్నర్ రాజ్‌ఖోవా ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీం కోర్టు ‘అసెంబ్లీలో పార్టీల బలాబలాలకు ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలిగించడానికి వీల్లేదు'అని తెలిపింది.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే రాజ్యాంగ అధికారం స్పీకర్‌దేనని, ఈ అధికారాన్ని గవర్నర్ ఎలా చేజిక్కించుకుంటారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అసెంబ్లీ పనితీరు విషయంలో గవర్నర్‌కు కొంత పాత్ర ఉండవచ్చునేమో గానీ, పదో షెడ్యూలు (ఫిరాయింపు నిరోధక నిబంధన) విషయంలో మాత్రం ఆయనకు ఎలాంటి అధికారం ఉండదని తేల్చిచెప్పింది.
మైనార్టీ కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకే 16మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన సమయంలోనే గవర్నర్ రాజ్‌ఖోవా ఆదేశం వెలువడింది. తలసాని శ్రీనివాస యాదవ్ విషయంలో టిడిపి గవర్నర్‌ను నిందిస్తూ వచ్చింది. అయితే, గవర్నర్ ఆ విషయంలో ఏమీ చేయలేరనే విషయం తాజా తీర్పును బట్టి అర్థమవుతోంది.
తమ పార్టీ నుంచి ఫిరాయించిన శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. అయితే, స్పీకర్ ఆ ఫిర్యాదులపై ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు కూడా చేపట్టలేదు. స్పీకర్‌పై కోర్టులకు వెళ్లినా లాభం లేదని తాజా సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి అర్థమవుతోంది.
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చర్య తీసుకోకపోవడాన్ని తప్పు పడుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చే అవకాశం ఉంది. పది మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల గ్రూపును తెరాసలో విలీనం చేయాలని కోరుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై తెలంగాణ స్పీకర్ మధుసూదనా చారి వెంటనే స్పందించే అవకాశాలున్నాయి. దీంతో టిడిపి ఏ విధమైన ఊరట కూడా లభించే అవకాశం ఉంది.
టిడిపి నుంచి తెరాసలోకి వచ్చిన శాసనసభ్యులు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిన ఆగత్యం చట్టపరంగా ఏ ఉండే అవకాశం లేదు. నైతికంగా బాధ్యత వహించి వారు రాజీనామా చేస్తారని అనుకోవడానికి లేదు.












Click it and Unblock the Notifications