చర్లపల్లి నుంచి ప్రధాన రైళ్ల రాకపోకల పై తాజా నిర్ణయం..!!
చర్లపల్లి రైల్వే స్టేషన్ పూర్తి హంగులతో అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈ టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ స్టేషన్ నుంచి కొన్ని ప్రధాన రైళ్ల ప్రారంభ.. గమ్య స్థానంగా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు ఈ నిర్ణయం లో మార్పు జరిగింది. స్టేషన్ లో ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉండటంతో ప్రస్తుతానికి ప్రత్యేక రైళ్లనే నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయం లో ప్రయాణీకులు రిజర్వేషన్లు చేసుకొని ఉండటంతో.. ఇప్పటికిప్పుడు చర్లపల్లి నుంచి రైళ్ల నిర్వహణ అమలు పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మూడు నెలల తరువాత
కొత్తగా ప్రారంభించిన చర్లపల్లి టెర్మినల్ నుంచి రెగ్యులర్ రైళ్ల రాకపోకల నిర్వహణ పైన దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా నిర్ణయం చేసారు. ఇక్కడి నుంచే 27 ప్రధాన రైళ్లకు గమ్యస్థానం గా తొలుత నిర్ణయించారు. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయం అమలుకు మరో మూడు నెలల సమ యం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే (90 రోజులు ముందుగా) సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి/వరకు వివిధ రైళ్లలో ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించుకున్నారు. దీంతో, ఖరారు చేసిన రైళ్లను చర్లపల్లి ప్రారంభం .. గమ్య స్థానంగా రిజర్వేషన్ వేళ ఖరారు చేసుకొనే అవకాశం ఇచ్చి.. ఆ తరువాత అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వంతో సంప్రదింపులు
ఇదే సమయంలో.. చర్లపల్లి టెర్మినల్‌కు అప్రోచ్ రహదారుల విస్తరణపై రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు రైల్వే అధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఆర్టీసీ సైతం చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు సర్వీసుల ఏర్పాటు పైన కసరత్తు జరుగుతోంది. రైల్వే స్టేషన్ కు రాకపోకలు సాగించే ప్రయాణీకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చర్లపల్లి నుంచి ప్రారంభమైన తొలి రైలు తిరుపతికి చేరుకొని తిరిగి చర్లపల్లికి చేరింది. ఇక.. నిర్వహణ పనుల కారణంగా జనవరి నెలాఖరు వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్-కాచిగూడ (77601- 77602) రైళ్లను జనవరి 8నుంచి 31 వరకు రద్దు చేశారు.
ప్రత్యేక రైళ్లు
వీటితో పాటుగా మరికొన్ని రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. కొన్నింటి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. మరో వైపు..సంక్రాంతి ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను మంగళవారం ప్రకటించింది. జనవరి 9న కాకినాడ టౌన్-వికారాబాద్ (07205), 10న వికారాబాద్-శ్రీకాకుళంరోడ్(07207), 11న శ్రీకాకుళంరోడ్-చర్లపల్లి(07208), 12న చర్లపల్లి-కాకినాడటౌన్(07206) రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications