ట్రాక్టర్లు, లారీలలో సీక్రెట్ లాకర్లు.. పుష్ప సినీఫక్కీలో జరుగుతున్న దందా చూసి పోలీసులే షాక్!!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. డ్రగ్స్ దందా చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ కేంద్రంగా వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు అక్రమ రవాణా అవుతోంది. ఇక విశాఖ నుండి మాత్రమే కాదు ఒడిశా రాష్ట్రం నుండి కూడా గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా సాగుతుంది. గంజాయిని అరికట్టడం కోసం, గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినా, పోలీసులకు, నిఘా వర్గాలకు చిక్కకుండా గంజాయి దందా చేస్తున్నారు. గంజాయి దందా ఎలా చేస్తున్నారో పసిగట్టటం పోలీసులకు పెద్ద పరీక్షలా మారింది.
రైళ్ళద్వారా గంజాయి దందా.. ఇద్దరు మహిళలతో సహా నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం నుంచి ఖమ్మం మీదుగా రాజస్థాన్ తరలిస్తున్న 75 లక్షల రూపాయల విలువైన 250 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ గంజాయిని తరలించడానికి రెండు ట్రాక్టర్లను, ఒక లారీని వారి వినియోగించినట్లు గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కంటపడకుండా గంజాయి స్మగ్లింగ్ చేయడం కోసం వారు పుష్ప సినిమా స్టైల్ లో ట్రాక్టర్లకు, లారీలకు అడుగున ప్రత్యేక అరలను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన సీక్రెట్ లాకర్లలో గంజాయిని పెట్టి చాలా తెలివిగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

ట్రాక్టర్ క్రింది భాగంలో గంజాయి పెట్టి తరలింపు
ట్రాక్టర్ హైడ్రాలిక్ లిఫ్ట్ చేస్తేనే ఈ అమరికలు కనపడే అవకాశం ఉంటుంది. ఇక ట్రాక్టర్లో ఏదైనా సరుకులు తీసుకు వెళుతున్నట్లుగా చూపించి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అసలు దందా చేస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు ట్రాక్టర్ల హైడ్రాలిక్ లిఫ్ట్ చేసి దాని కింద ఉన్న అమరికలను చూసి, వాటిలో రవాణా అవుతున్న గంజాయి ని చూసి షాక్ తిన్నారు. ఇక ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు

ఖమ్మంలో రాజస్థాన్ కు చెందిన లారీలలో గంజాయి ఎక్కిస్తుండగా పట్టివేత
ఖమ్మం బుర్హాన్ పురం లో రాజస్థాన్ కు చెందిన లారీలలో గంజాయి ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇక ఈ కేసులో నలుగురి అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని సిపి విష్ణు వారియర్ వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెడుతున్నామని, ప్రజలలో గంజాయిపై అవగాహన కల్పిస్తున్నామని సిపి విష్ణు వారియర్ వెల్లడించారు.

ఒడిశా నుండి యధేచ్చగా గంజాయి దందా... పట్టుకుంటున్న పోలీసులు
పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను సిపి అభినందించారు. వారికి రివార్డులను అందజేశారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఒడిశా నుండి కూడా గంజాయి స్మగ్లింగ్ నిత్యకృత్యంగా మారింది. రైళ్ళు, బస్సులు, ట్రాక్టర్లు, లారీలు ఇలా వాహనం ఏదైనా అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. గంజాయి అక్రమ దందాకు పాల్పడుతూనే ఉన్నారు.