ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయనకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. డెహ్రాడూన్ నుంచి మంగళవారం రాత్రి వరకు ఆయన సికింద్రాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. తమ అభిమాన నేతకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో పద్మారావు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాయి.

పద్మారావు ఆరోగ్యం నికలడగా ఉందని, పూర్తిగా కోలుకున్నారని వైద్యులు చెప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు, పద్మారావు గౌడ్ మంగళవారం రాత్రికి సికింద్రాబాద్ చేరుకుంటారని తెలియడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పద్మారావు ఇంటికి చేరుకుంటున్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా పద్మారావు గౌడ్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిసింది.
కాగా, పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిలో 2001లో చేరి 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. పద్మారావు గౌడ్ 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో, 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. 2014 జూన్ 2 న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు పద్మారావు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2024లో 18వ లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పద్మారావు పోటి చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. దీంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications