ఎదురింటి అబ్బాయితో ప్రేమ-అమ్మాయి తల్లిదండ్రులకు ఘోర అవమానం-మూడో అంతస్తు నుంచి దూకిన యువతి
ప్రేమ పేరుతో దగ్గరైన ఓ యువకుడు చివరకు తనను దూరం పెట్టడంతో పాటు చంపేస్తానని బెదిరింపులకు దిగుతుండటంతో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. అపార్ట్‌మెంటులోని మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె తండ్రి తెలిపారు. సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎదురింటి ట్యూషన్ మాస్టర్‌తో ప్రేమ
పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని చిన్నతోకట్టా తిరుమల అపార్ట్‌మెంట్‌లో నర్సింహులు కుటుంబం నివాసం ఉంటోంది. నర్సింహులు కూతురు శైలజ (23) బీటెక్ చదువుతోంది. నర్సింహులు ఎదురు ఫ్లాట్‌లో పవన్ కల్యాణ్ అలియాస్ సన్నీ(25) అనే యువకుడు ఉంటున్నాడు. స్థానిక పిల్లలకు అతను ట్యూషన్లు చెప్పేవాడు. ఇదే క్రమంలో అతనికి శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇద్దరి ప్రేమాయణం కొన్నాళ్లు సాఫీగానే సాగింది.

కులం పేరుతో దూషించిన అబ్బాయి తల్లిదండ్రులు
కొన్నాళ్ల క్రితం శైలజ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో శైలజ తల్లిదండ్రులు పవన్ కల్యాణ్ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వెళ్లారు. అమ్మాయి-అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారని... మీరు ఒప్పుకుంటే పెళ్లి చేద్దామని వారితో చెప్పారు. కానీ పవన్ తల్లిదండ్రులు అందుకు ససేమిరా అన్నారు. కుల ప్రస్తావన తీసుకొచ్చి మీరేంటి మేమేంటి అని దూషించారు. దీంతో అవమాన భారంతో శైలజ తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. అప్పటినుంచి శైలజ-పవన్‌ల మధ్య మాటలు లేవని తెలుస్తోంది.
Recommended Video

యువతి ఆత్మహత్యాయత్నం
ఇదే క్రమంలో ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పవన్ శైలజ ఇంట్లోకి వెళ్లాడు. ఆమెను చంపేస్తానని బెదిరించాడు. నెల రోజుల్లోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పటినుంచి శైలజ తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. ఈ నెల 27న రాత్రి 10గంటల సమయంలో అపార్ట్‌మెంటులోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి వున్న శైలజను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శైలజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె తండ్రి తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications