వీడియో: కాలగర్భంలో మధుర జ్ఞాపకాలు..!!
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితం. మొత్తం 10 ప్లాట్‌ఫామ్స్, 11 ట్రాక్స్ ఉన్న స్టేషన్ నుంచి నిత్యం 241 రైళ్లు దేశం నలుమూలలకూ రాకపోకలు సాగిస్తోంటాయి. దేశంలో అత్యధిక ఆదయాన్ని ఆర్జించే జోన్లల్లో ఒకటిగా ఉండే దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువు.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు విస్తరించిన ఈ అతిపెద్ద జోన్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయం ఉండేది సికింద్రాబాద్‌లోనే. వందే భారత్, రాజధాని, శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తోన్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్ ఫామ్‌ల సంఖ్యకు అనుగుణంగా దీన్ని మరింత విస్తరిస్తోన్నారు. ఆధునికీకరిస్తోన్నారు. ఎయిర్‌పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు.

ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తుకొచ్చే ఐకనిక్ భవనం ఇప్పుడు చరిత్ర పుటల్లో కలిసిపోతోంది. ఆధునికీకరణలో భాగంగా ఐకనిక్ బిల్డింగ్‌ను కూల్చివేస్తోన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్ అనే అక్షరాలను రాసివున్న ఐకనిక్ బిల్డింగ్ కూల్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి.
సుమారు 60 సంవత్సరాల కిందట నిర్మితమైందీ ఐకనిక్ బిల్డింగ్. అప్పట్లోనే ఫ్యూచరిస్టిక్‌గా, హారిజాంటల్ విధానంలో రూపుదిద్దుకున్న బిల్డింగ్ ఇది. ఇదొక ల్యాండ్ మార్క్‌గా ఉంటూ వచ్చింది ఇన్నేళ్లూ. ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతోంది. ఈ ఐకనిక్ బిల్డింగ్ కూల్చివేత శరవేగంగా సాగుతోంది.
తెలంగాణలో- సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడు దశల్లో పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ పునర్నిర్మితం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications