"తెలంగాణ వచ్చాక వందల రెట్లు లబ్ది పొందింది కేసీఆర్ కుటుంబమే"
బీఆర్ఎస్ హయంలో నమోదైన కేసు విచారణ సందర్భంగా మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలన్నందుకు బీఆర్ఎస్ హయంలో తమ మీద కేసు నమోదైందని వివరించారు. ఇందిరా పార్క్ వద్ద శాంతియుత దీక్ష చేసినందుకు బీఆర్ఎస్ హయంలో తమ మీద కుట్ర పూరితంగా కేసు పెట్టారని అన్నారు. కరోనా టైంలో సామాన్య ప్రజల ఖరీదైన ట్రీట్‌మెంట్ చేసుకోలేరని ఆరోగ్య శ్రీ లో చేర్చాలన్నామని.. పేద ప్రజల ప్రాణాల కోసమే ఇందిరాపార్క్ దగ్గర నిరహార దీక్ష చేసామని గుర్తు చేశారు.
తాము చేసింది న్యాయ మైన పోరాటం అని.. రాజకీయాల కోసం చేసిన దీక్ష కాదని స్పష్టం చేశారు. తమ తరఫున న్యాయవాదులు నాగులూరి కృష్ణ కుమార్ గౌడ్ ,నరేందర్ కుర్మ, ఎస్ఎస్ రావు వాదనలు వినిపించారని తదుపరి విచారణను డిసెంబర్ 18 కు కోర్టు వాయిదా వేసిందని తెలిపారు. కోర్టుల మీద నమ్మకం ఉంది, విచారణకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఉన్నామని, తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
అలాగే.. బీఆర్ఎస్ దీక్షా దివాస్ ను ఉద్దేశించి మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. "బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసే వాళ్లు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్ ను పరిమితం చేశారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి ? ప్రజలను మోసగించేందుకు, అధికార పార్టీ నిర్మించేందుకు పది రోజులపాటు దీక్షా దివస్ నిర్వహిస్తారట.. ఇప్పుడు పది రోజులు డబ్బా కొట్టుకునేందుకు రెడీ అయ్యారు. ప్రజలకు పదేండ్లలో చేసిన అభివృద్ధి ఏంటో దీక్షా దివాస్ లో చెప్పాలి. రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఎంతో చేసింది. విజయాలను ప్రజలకు వివరించేందుకు మేము 10 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా విజయోత్సవాలను అడ్డుకునే కుట్రతోనే దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

" తెలంగాణ ఆకాంక్ష దశాబ్దాల నుండి ఉంది. కేసీఆర్ దీక్ష గుట్టు నిమ్మరసానికి ఎరుక. తెలంగాణ వచ్చాక వందల రెట్లు లబ్ది పొందింది కేసీఆర్ కుటుంబమే. బీఆర్ఎస్ దగ్గర అధికారం మాత్రమే లేదు. కోట్లాది రూపాయలు ఉన్నాయి. దోచుకున్న డబ్బులతో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కార్యక్రమాలైనా చేస్తారు. మేం చెప్పినట్టే రాష్ట్ర ప్రజలు వినాలి అనేలా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటాం. లేకపోతే బయటకే రావొద్దని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు" అని మంత్రి సీతక్క తెలిపారు.












Click it and Unblock the Notifications