YS Sharmila: షర్మిల సెల్ఫ్ గోల్ - భారీ డామేజ్, ఇక తప్పదా..!?
వైఎస్ షర్మిల రాజకీయంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారా. ఏం జరుగుతోంది. కొద్ది రోజులుగా వైఎస్సార్టీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ చర్చ మొదలైంది. కాంగ్రెస్ తో విలీనం రివర్స్ అయింది. ఒంటరి పోరుకు సిద్దమని షర్మిల ప్రకటించారు. కానీ, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు. ఈ హోరా హోరీ పోరులో షర్మిలకు దక్కే మద్దతు ఏ స్థాయిలో ఉంటుంది. షర్మిల రాజకీయంగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
గురి తప్పిన బాణం:వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అంటూ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో అన్న జగన్ కు తోడుగా నిలిచారు. వైసీపీ అధికారం లోకి వచ్చే వరకూ తన వంతు సహకారం అందించారు. ఆ తరువాత కారణాలు ఏమైనా అన్నతో విభేదించి తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసారు. అన్న వద్దని చెప్పినా..ముందుకే వెళ్లారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు సమయంలో షర్మిల రాజకీయ భవిష్యత్ పైన అంచనాలు కనిపించాయి. కానీ, కాల క్రమేణా తగ్గిపోయాయి. షర్మిల పార్టీ విస్తరణ..కేడర్ బలోపేతం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేక పోయారు. తాను ఎవరు వదిలిన బాణం కాదని చెప్పుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ నాయకత్వం లక్ష్యంగా పని చేసారు.

రాజకీయంగా ఒంటరయ్యారా:ఎన్నికలకు కొంత కాలం ముందు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. కర్ణాటకలో విజయం తరువాత తెలంగాణ పైన ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో ఉన్న సత్సంబంధాలను తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం....కాంగ్రెస్ పార్టీ నేతగా తెలంగాణలో రాజీయ భవిష్యత్ గురించి ఆశలు పెట్టుకున్నారు. కానీ, రేవంత్ అండ్ టీం తెలంగాణ కాంగ్రెస్ షర్మిల జోక్యాన్ని వ్యతిరేకించారు. షర్మిల ఎంట్రీ కేసీఆర్ కు అస్త్రంగా మారుతుందని హైకమాండ్ కు నచ్చ చెప్పారు.
దీంతో నేరుగా సోనియా, రాహుల్ తో చర్చలు చేసినా షర్మిలకు ఎటువంటి హామీ దక్కలేదు. చివరకు షర్మిల కోరుకున్న పాలేరు సీటు పైనా హామీ ఇవ్వలేదు. ఫలితంగా కాంగ్రెస్ తో ఇక కలిసేది లేదని తేల్చారు. ఒంటరి పోరాటినికి సిద్దమయ్యారు. పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్దులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కానీ, వైఎస్సార్టీపీలో ఇంకా ఎన్నికల సందడి కనిపించటం లేదు.

షర్మిల వాట్ నెక్స్ట్:షర్మిల పాలేరు నుంచి పోటీకి సిద్దమయ్యారు. తన తల్లి విజయమ్మ అవసరమైతే పోటీ చేస్తారని చెప్పటం వైఎస్సార్ అభిమానులకు నచ్చలేదు. ఒకసారి విశాఖ నుంచి పోటీ చేసి విజయమ్మ ఓడిన సమయంలో నే రాజకీయ ప్రత్యర్ధులకు విమర్శలకు అవకాశం ఏర్పడింది. మరోసారి తెలంగాణలో పోటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ కుమార్తెగా షర్మిల రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు వారికి రుచించటం లేదు. ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం లేకపోతే..భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది.
ఇదంతా వ్యూహాలు లేకుండా షర్మిల చేసుకున్న సెల్ఫ్ గోల్ గా విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లోనూ.. తరువాత షర్మిల పాత్ర ఏంటనేది అసలు చర్చ. మరి షర్మిల ఏం చేయబోతున్నారు. ఇటు తెలంగాణ..ఆ తరువాత ఏపీ ఎన్నికల వేళ ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications