డీ శ్రీనివాస్ కన్నుమూత
D Srinivas: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ ఛైర్మన్ ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీ శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. 2015లో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది బీఆర్ఎస్. ఆ తరువాత మళ్లీ సొంతగూటికి చేరారు.

డీ శ్రీనివాస్ సొంత నియోజకవర్గం.. నిజామాబాద్. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పని చేశారు. 1989లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఘన విజయం సాధించారు. 1999, 2004 నాటి ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించారు డీఎస్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, పీసీసీ చీఫ్‌గా డీఎస్.. కాంగ్రెస్‌ను సంఘటితం చేశారు. 2004, 2009 నాటి ఎన్నికల్లో వరుసగా పార్టీని గెలిపించారు. 2013లో శాసన మండలికి నామినేట్ అయ్యారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ తరువాత మళ్లీ సొంతగూటికి చేరారు. డీఎస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్.. ప్రస్తుతం నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు.పెద్ద కుమారుడు సంజయ్ ఇదివరకు నిజామాబాద్ మేయర్గా పని చేశారు.












Click it and Unblock the Notifications