
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17-విమోచనమా,విలీనమా,విద్రోహమా-ఎందుకీ భిన్నాభిప్రాయాలు...
సెప్టెంబర్ 17... తెలంగాణ చరిత్ర కీలక మలుపు తిరిగినరోజు. ఆనాటి భారత ప్రభుత్వ సైనిక చర్య ద్వారా స్వతంత్ర రాజ్యంగా ఉన్న తెలంగాణ భారతదేశంలో భాగమైన రోజు. అయితే ఈ సైనిక చర్య ప్రజామోదమా.. కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనమా.. విలీనమా లేక విద్రోహమా అన్న దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఒక్కో రాజకీయ పార్టీ దీన్ని ఒక్కోలా అభివర్ణిస్తూనే ఉంది. బీజేపీ దీన్ని విమోచన దినంగా పాటిస్తుంటే కాంగ్రెస్,టీజేఎస్ విలీన దినంగా,కమ్యూనిస్టులు విద్రోహం దినంగా పాటిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని విలీన దినోత్సవంగానే పాటిస్తున్నప్పటికీ ప్ధ్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించట్లేదు.
Recommended Video

కమ్యూనిస్టుల వాదన ఇలా...
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి తెలంగాణ ఈ దేశంలో భాగమైంది. సెప్టెంబర్ 14,1948 నుంచి సెప్టెంబర్ 17,1948 వరకు నాలుగు రోజుల పాటు ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేత్రుత్వంలో నిజాం రాజుపై సైనిక దాడి జరిగింది. దీన్నే ఆపరేషన్ పోలో అని అంటారు. ఈ సైనిక చర్యతో నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. అలా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైంది. ఆపరేషన్ పోలో సమయంలో వేలాది మంది అమాయక ముస్లింలను సైతం ఊచకోత కోశారనే వాదన ఉన్నది.నిజానికి ఆనాటి నిజాం వ్యతిరేక పోరులో హిందువులతో పాటు షేక్ బందగీ లాంటి ముస్లిం వీరులు,మఖ్దూం మొహీయుద్దీన్ లాంటి కవులు తమవంతు కీలక పాత్ర పోషించారు. అప్పటికే ప్రజా సాయుధ పోరాటాలు,కమ్యూనిస్ట్ పోరాటాలు తెలంగాణలో ఉధృతంగా సాగుతున్నాయి. ఆ పోరాటాలు విజయవంతమైతే తెలంగాణ రాజ్యం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపిందనేది వామపక్ష వాదుల వాదన.

రజాకార్ల హింస,దౌర్జన్యాలు..
దేశమంతా బ్రిటీష్ పాలనలో ఉంటే తెలంగాణ మాత్రం నిజాం పాలనలో ఉన్నది. నిజాం నిరంకుశ ప్రభుత్వంలో ఇక్కడి ప్రజలు దోపిడీ,పీడన,బానిసత్వంలో మగ్గిపోయారు. ఈ క్రమంలో 1945-46 ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం వెన్నులో వణుకు పుట్టించింది. కమ్యూనిస్టు ఉద్యమాలు,ప్రజా ఉద్యమాలు భూస్వామ్య వ్యవస్థ అంతానికి పూనుకున్నాయి. దీంతో నిజాం పాలకులు రజాకార్ల సైన్యాన్ని రంగంలోకి దించారు. రజాకార్లు గ్రామాలపై పడి మరింత హింసకు పాల్పడ్డారు. సెప్టెంబర్ 2న పరకాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు కొంతమంది పూనుకోగా... వారిపై రజాకార్లు కాల్పులు జరపడంతో 22 మంది అమరులయ్యారు. వీర భైరాన్‌పల్లిదీ ఇదే ధీన గాథ. రజాకార్ల సైన్యాన్ని ఎన్నోసార్లు తరిమికొట్టిన వీర భైరాన్‌పల్లిపై ఖాసీం రజ్వీ సైన్యం ఒకానొక వేకువ జామున దాడి చేసి 118 మంది గ్రామస్తులను పొట్టనబెట్టుకుంది.

సైనిక చర్యకు దారితీసని పరిస్థితులు...
1947కి ముందు భారతదేశం అనేక సంస్థానాలుగా ఉండింది. ఆనాటి బ్రిటీష్ పాలకులు భారతదేశాన్ని విడిచి వెళ్తూ ఒక ప్రకటన చేశారు.భారత యూనియన్‌లో సంస్థానాల విలీనం వారి ఇష్టానికే వదిలేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థానాలు తమకిష్టమైతే యూనియన్‌లో కలవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అని పేర్కొన్నారు. దీంతో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత యూనియన్‌లో కలిసేందుకు నిరాకరించాడు.మరోవైపు భారత యూనియన్‌లో విలీనానికి నిజాం రాజుపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.దీంతో ఐక్యరాజ్య సమితి,బ్రిటన్ ప్రధాని జోక్యం కోరుతూ నిజాం లేఖలు రాశాడు. అదే సమయంలో నిజాం విముక్తి కోసం ఇక్కడ ప్రజా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. రజాకార్ల కార్య కలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాంకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాదుకు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందంతో నిజాము ఉద్దేశం.

సైనిక చర్య జరిగిందిలా...
1948 ఆగష్టు 9 న టైమ్స్ ఆఫ్ లండన్‌లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ నిజాం రాజు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. దీంతో నిజాంపై భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. గోడ్డాన్ ప్లాన్ అని కూడా అంటారు మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. 1948 సెప్టెంబర్ 18న నిజాము లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్ లాయిక్ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు.

ఒక్కో రాజకీయ పార్టీ... ఒక్కోలా...
ఈ చరిత్రను ఎవరి కోణంలో వారు విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఒక్కో వైఖరి అవలంభిస్తున్నాయి. బీజేపీ తొలి నుంచి ఇది విమోచనా దినోత్సవమేనని చెబుతోంది.కొంతమంది కమ్యూనిస్టులు అతివాద దృక్పథంతో చరిత్రను వామపక్ష పక్షపాత సైద్దాంతిక ధోరణికి అనుకూలంగా వక్రీకరించారని ఆరోపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ ఇది విద్రోహ దినమే అని వాదిస్తున్నాయి. ఇక కాంగ్రెస్,టీజేఎస్ తదితర పార్టీలు మధ్యేమార్గంగా దీన్ని విలీన దినోత్సవంగా పాటిస్తున్నాయి.అధికార టీఆర్ఎస్.. పార్టీ వరకు దీన్ని విలీన దినోత్సవంగానే జరుపుతోంది.అయితే ఒక ప్రభుత్వంగా అధికారిక నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఉద్యమ కాలంలో సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరిపేందుకు టీఆర్ఎస్ అంగీకరించింది.అంతకుముందు,ఓ సందర్భంలో విమోచనా దినోత్సవంగా జరుపుతామని కేసీఆర్ ప్రకటించారు.కానీ జేఏసీ చర్చల ఫలితంగా విలీనం అనే స్టాండ్ తీసుకున్నారు.కానీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ఏ వాదన వైపు నిలవట్లేదు. మైనారిటీలకు వ్యతిరేకం కావొద్దనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఈ వైఖరిని అవలంభిస్తోందన్న విమర్శలున్నాయి.