హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్- భారీ ఆర్ఓబీ ప్రారంభం
హైదరాబాద్ వాహనదారులకు శుభవార్త అందింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఓ రోడ్ ఓవర్ బ్రిడ్జి (RoB) శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. నాలుగు లేన్ల వంతెన ఇది. నేరుగా జాతీయ రహదారి- 44, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ట్రాఫిక్‌ను గణనీయంగా సులభతరం చేస్తుందీ ఆర్ఓబీ. రోజువారీ లక్ష మంది వాహనదారులు, ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇది ఉపశమనం ఇస్తుంది.
సికింద్రాబాద్- ఫలక్‌నుమా- శివరాంపల్లి రైల్వే లైన్‌లోని లెవెల్ క్రాసింగ్ నంబర్ 7పై దీన్ని నిర్మించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. శాస్త్రిపురం మీదుగా మైలార్‌దేవ్‌పల్లి నుండి ఫలక్‌నుమా ఆర్టీసీ డిపో వరకు గల దూరాన్ని అనుసంధానించడానికి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. ఈ ఆర్ఓబీ వల్ల బిబి కా చష్మా, ఫలక్‌నుమా, వట్టేపల్లి, శాస్త్రిపురం, తీగలకుంట, నవాబ్ సాహెబ్ కుంట (శంషాబాద్ వైపు), కాటేదాన్, ఆరంఘర్ వంటి పరిసర ప్రాంతాల ప్రజలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుంది.

బండ్లగూడ రోడ్డుకు చేరుకోవడానికి నేషనల్ పోలీస్ అకాడమీ, శివరంపల్లి లేదా ఫలక్‌నుమా-చంద్రాయణగుట్ట మార్గం గుండా గతంలో నాలుగు కిలోమీటర్ల అనవసరపు ప్రయాణం ఉండేది. ఇప్పుడు ఈ ఆర్ఓబీతో వల్ల అయిదు నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు. మైలార్‌దేవ్‌పల్లి నుండి వట్టేపల్లి మీదుగా ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపోకు వెళ్లే ప్రయాణ సమయం కూడా 30 నిమిషాలు ఆదా అవుతుంది.
ఈ ఆర్ఓబీ నిర్మాణ వ్యయం మొత్తం 71 కోట్ల రూపాయలు. దీని మొత్తం పొడవు 490 మీటర్లు. ఇందులో రైల్వే భాగం 37.28 మీటర్లు. వంతెన మొత్తం వెడల్పు 16.60 మీటర్లు. ఇది అత్యాధునిక స్టీల్ గర్డర్‌లతో నిర్మితమైంది. ఆర్సీసీ ప్రీకాస్ట్ ఎలిమెంట్స్, పీఓటీ- పీటీఈఎప్ బేరింగ్, మాడ్యులర్ ఎక్స్‌పాన్షన్ జాయింట్లు వంటి ఆధునిక ఇంజనీరింగ్ ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది. సమయం ఆదా కావడంతో పాటు ఇంధన వినియోగం, వాహన కాలుష్యం తగ్గుతుంది.












Click it and Unblock the Notifications