తెలంగాణలో వరదల వేళ చౌహాన్ కీలక వ్యాఖ్యలు..!!
వరద బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. ఖమ్మం పరిసరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తో కలిసి ఆయన వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తాను రాజకీయాలు చేసేందుకు ఇక్కడకు రాలేదని చెప్పారు. అదే సమయంలో బీఆర్ఎస్ హాయంలో అంశాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఖమ్మంలో పర్యటించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. వరదలు ముంచెత్తి రైతులు సర్వం కోల్పోయారన్నారు. నిజంగా వారిని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధేస్తుందని చెప్పారు. రైతులు ఆందోళనలో ఉన్న సమయంలో కేంద్రం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నిధులను సక్రమంగా వినియోగించుకోలేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మళ్లించిందని చౌహాన్ చెప్పుకొచ్చారు.

తాను కూడా ఒక రైతునేనని..తనకు రైతుల కష్టాలు ఎలా ఉంటాయో బాగా తెలుసన్నారు. ఏరియల్ సర్వేతో వరద ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా పరిశీలించానని చెప్పారు. వరదల కారణంగా వరి, ఇతర పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదని వ్యాఖ్యానించారు. పశువులు, ఇతర మూగ జీవులు ప్రాణాలు కోల్పోయాయన్నారు. వరద సమయంలో రాజకీయాలు వద్దని చెప్పిన చౌహాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు భరోసాగా ఉంటామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications