బోధన్ ఎమ్మెల్యేకు షాక్.. మిస్సింగ్ అంటూ ఫ్లెక్సీలు; నిజామాబాద్లో పొలిటికల్ హీట్!!
నిజామాబాద్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఎంపీ అరవింద్ వర్గం నియోజకవర్గంలో రచ్చ చేస్తున్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే కు షాక్ ఇచ్చారు బిజెపి నాయకులు. 20 రోజులుగా బోధన్ ఎమ్మెల్యే అదృశ్యమయ్యాడు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ఆయనను టార్గెట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కు వ్యతిరేకంగా బోధన్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కనిపించటం లేదని పేర్కొని పోస్టర్లు వేశారు. తడిసిన ధాన్యాన్ని నేనే కొంటానని చెప్పిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ అకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులకు మాట ఇచ్చి , అప్పటి నుండి ఇప్పటి వరకు గింజ కూడా కొనలేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాడలేని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అంటూ కొన్ని ఫ్లెక్సీలలో పేర్కొన్నారు.
వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జాడ లేకుండా పోయారని చెప్పిన నాటి నుండి ఇప్పటివరకు గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని ఫ్లెక్సీలలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బిజెపి బోధన్ నియోజకవర్గం పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు మాటలు చెప్పడమే కానీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే లక్షణం లేదని ఫ్లెక్సీల వేదికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు. అయితే బిజెపి నాయకులు కావాలని ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, బీజేపీ ఇటువంటి నీచమైన పనులు చేస్తుందని కానీ ప్రజలు దీనిని పట్టించుకోరని షకీల్ వర్గం చెబుతోంది.
ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఒకపక్క ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలలోకి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పంపించడం కోసం బీజేపీ ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications