బీఆర్ఎస్ కు షాక్: కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడును కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి, రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుని ఉందని, గత ప్రభుత్వపాలన అరాచక పాలన అని, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను కూడా ఎండగట్టే పనిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇక ఇదే క్రమంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 29వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. వాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన లాభనష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ లను పరిశీలించనున్నారు.
అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఈ ఎన్ సి ని ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, ప్రస్తుతం అవుతున్న ఖర్చు, దీనివల్ల సాగునీరు అందుతున్న ఆయకట్టు వివరాలు అన్నింటిని చెప్పనున్నారు.
తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు తెలియ చెప్పే ప్రయత్నంలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, గతంలో పంపు హౌస్ మునిగిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుండటం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications