వైఎస్ షర్మిల పార్టీకి షాక్ .. వైఎస్ఆర్టీపీ కీలక నేత చేవెళ్ళ ప్రతాప్ రెడ్డి రాజీనామా
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానని రాజకీయ ఆరంగేట్రం చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే షర్మిల పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ రాజకీయ పార్టీతో తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తూ, దూకుడు పెంచుతున్న షర్మిల పార్టీకి ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు.
షర్మిల పార్టీలో ఉన్న కీలక నేత రాఘవ రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా ఆయన తన రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించి చేవెళ్ల ప్రతాప్ రెడ్డి షర్మిలకు షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న షర్మిల పార్టీకి ఆదిలోనే పార్టీ పట్ల పార్టీ నేత నుండి విముఖత వ్యక్తమైంది. పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పడంతో, మొదట్లోనే షర్మిల పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందని చర్చ చోటు చేసుకుంది. ప్రస్తుతం అన్ని జిల్లాలలో పార్టీని బలోపేతం చేయాలని కసరత్తు చేస్తున్న షర్మిలకు, తాజా పరిణామం కాస్త ఇబ్బందికర పరిణామమే చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కోవడానికి షర్మిల ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిరుద్యోగ సమస్యపై నిరాహార దీక్షలు చేస్తూ, సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు హుజురాబాద్ ఎన్నికల బరిలో తమ పార్టీ ఉండబోదని స్పష్టం చేసిన షర్మిల రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ఇలా అధికార పార్టీపై పోరాటం చేస్తున్న షర్మిల, తాజా రాజీనామాతో సొంత పార్టీని బలోపేతం చెయ్యగలరా అన్న అనుమానం పలువురిలో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications