ఇప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ గుర్తొచ్చిందా, ఆధారాలున్నాయి: ఏబీవీపీ సుశీల్
హైదరాబాద్: ఏఎస్ఏ సభ్యులు తనను అర్ధారాత్రి తీవ్రంగా కొట్టారని, అలాగే మాదిగ సామాజిక వర్గానికి చెందిన మరో విద్యార్థిని కొట్టారని, అప్పుడు ఎవరికీ భావస్వేచ్ఛ గుర్తుకు రాలేదా అని ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ గురువారం నాడు మండిపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ గురువారం నాడు మీడియా ముందుకు వచ్చారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రోహిత్ సూసైడ్‌తో తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు.
అర్ధరాత్రి పూట ఏఎస్ఏ విద్యార్థులు తన పైన దాడి చేశారని చెప్పారు. తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. తాము ఎవరి పైన దాడికి పాల్పడలేదని చెప్పారు. తనను కొట్టిన పది రోజుల తర్వాత ఓ దళితుడిని కొట్టారని చెప్పారు. అతను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్నారు.

అతనిని అర్ధరాత్రి మూడు గంటల వరకు కొట్టారన్నారు. ఆ సమయంలో తాము వారి పైన చర్యలకు డిమాండ్ చేశామన్నారు. అయితే, వారికి శిక్ష పడాలనే భావన తమకు లేదన్నారు. వర్సిటీకి తన తల్లి వచ్చినప్పుడు కూడా వారు వెక్కిరించారని విమర్శించారు.
అర్ధరాత్రి పూట నా గదికి రావడం ఎవరికీ తప్పుగా కనిపించలేదా అన్నారు. తమ పైన దాడి కారణంగానే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రంలో బిజెపి ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా.. మరే ప్రభుత్వం ఉన్నా తాము అలాగే చేసేవారమన్నారు. అందుకే తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఇప్పుడు చాలామంది భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారని, అన్ని సందర్భాలలో అది ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. అయిదుగురు విద్యార్థుల పైన విశ్వవిద్యాలయ పరంగానే చర్యలు తీసుకున్నారని చెప్పారు. తాను ఓబీసీ కేటగిరీ నుంచి వచ్చానని చెప్పారు.
క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలి: వీసీ అప్పారావు
విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ అప్పారావు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యను అంతర్గతంగా మాట్లాడి చర్చించుకుందామని చెప్పారు. క్లాసులు, పరిశోధనకు అడ్డంకులు లేకుండా సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications