దారుణం ..పంటను మేక మేస్తే యువకుడి ప్రాణం తీశారు
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పంటను మేక మేస్తుందని యువకుడిని నరికి చంపిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 21 ఏళ్ళ వయసున్న ,మాటలు సరిగా రాని యువకుడిని అత్యంత కిరాతకంగా వేట కొడవలితో నరికి చంపిన ఘటన ధర్మాపూర్ గ్రామ వాసులను ఉలికిపాటుకు గురిచేసింది.

ధర్మాపురంలో దారుణం ... పంట మేక మేసిందని గొడవ
ఇక ఘటన వివరాలలోకి వెళితే ధర్మాపురం గ్రామానికి చెందిన బుడ్డా నరేష్ అనే యువకుడు తాను పెంచుకుంటున్న మేకను, దాని పిల్లలను మేపేందుకు చేనుకు వెళ్ళాడు. మేక పక్కనే ఉన్న జొన్న చేనులోకి వెళ్లడాన్ని అతను గమనించలేదు. మేక జొన్న ను తినడంతో చేను యజమాని అయిన అశోక్ ఆగ్రహానికి గురయ్యాడు. నరేష్ ను తిట్టిపోశాడు. ‘‘నా చేనులోకి మేకను వదులుతావురా?'' అంటూ శివార్లో గొడవ పడ్డాడు. నానా దుర్భాషలాడాడు .

అందరూ చూస్తుండగా వేట కొడవలితో దాడి .. నరేష్ అనే యువకుడు మృతి
ఇక అక్కడ నుండి ఇంటికి వెళ్లిన నరేష్ జరిగిన విషయం అంతా కుటుంబ సభ్యులతో చెప్పుకున్నాడు. ఊర్లోకి వచ్చాక కూడా అశోక్ ఊరుకోలేదు. రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టాడు. కుటుంబసభ్యులతో కలిసి రచ్చబండ దగ్గరకు వెళ్లి మరోసారి ఆ యువకుడితో గొడవకు దిగాడు. అందరూ చూస్తుండగానే.. వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ఆ యువకుడిపై దాడి చేశాడు . అందరు చూస్తుండగా జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా కంగుతిన్నారు. వేట కొడవలితో దాడి చెయ్యటంతో ఒక్కసారిగా నర్ష్ కుప్ప కూలాడు .ఆస్పత్రికి తరలించే లోపే నరేష్ మృతిచెందాడు.

నిందితుల ఇళ్ళ ముందున్న బైక్ లను తగలబెట్టిన నరేష్ బంధువులు .. గ్రామంలో ఉద్రిక్తత
నరేష్ పై దాడి చేసిన అశోక్ ,అశోక్ తరపు బంధువులు ఈ ఘటన తర్వాత పరారయ్యారు. నరేష్ హత్య ఘటనతో ఆగ్రహంతో ఉన్న నరేష్ తరపు బంధువులు నిందితుల ఇళ్ల ముందు ఉన్న రెండు బైక్లను దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
నరేష్ హత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా ధర్మాపూర్‌లో ఈ హత్య నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications