ఆ కారణంతో 'నో ఎంట్రీ': సింగపూర్ యువతికి షాకిచ్చిన హైదరాబాద్ హోటల్!
'సింగిల్ లేడీ' అన్న కారణంగా తనకు హోటల్ యజమానులు గది ఇవ్వడానికి నిరాకరించారని పేర్కొంది.
హైదరాబాద్: దేశంలో ఏ హోటల్ పాటించని రూల్స్.. ఆ ఒక్క హోటల్ మాత్రం పాటిస్తున్నట్లుంది. వివాహం కాని జంటలను అనుమతించని హోటల్స్ ను చూశాం కానీ.. 'సింగిల్ వుమెన్'కు నో ఎంట్రీ అంటూ ఓ హోటల్ షాక్ ఇవ్వడం తొలిసారిగా హైదరాబాద్ లోనే జరిగింది.
సింగపూర్ నుంచి నగరాన్ని సందర్శించడానికి వచ్చిన నుపుర్ సారస్వత్(22) అనే మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన అనుభవం గురించి ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేయడంతో.. ఆ పోస్టు కాస్త వైరల్ గా మారింది. గోఐబిబో ద్వారా ఎర్రగడ్డలోని హోటల్ దక్కన్ లో తాను గది బుక్ చేసుకున్నానని.. శనివారం నాడు హోటల్ వద్దకు వెళ్లగా.. తనను లోపలికి అనుమతించలేదని యువతి తన పోస్టులో చెప్పుకొచ్చింది.
'సింగిల్ లేడీ' అన్న కారణంగా తనకు హోటల్ యజమానులు గది ఇవ్వడానికి నిరాకరించారని పేర్కొంది. 'ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని ఓ హోటల్ బయట నిలుచుని ఉన్నాను. ఆన్ లైన్ బుకింగ్ ను అంగీకరించినప్పటికీ.. తాను 'సింగిల్ లేడీ' అన్న కారణంగా నాకు గదిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు' అంటూ పోస్టులో ఆమె వివరించారు.

ఈ పోస్టు వైరల్ గా మారడంతో.. స్పందించిన ట్రావెల్ వెబ్ సైట్ నగరంలోని మరో హోటల్లో ఆమెకు గదిని ఇప్పించింది. తనకు కలిగిన అసౌకర్యానికి ట్రావెల్ వెబ్ సైట్ తనకు క్షమాపణలు చెప్పిందని, ఇలాంటి నిబంధనలు పాటించే హోటళ్లను తమ వెబ్ సైట్ నుంచి తొలగిస్తామని చెప్పినట్లుగా నుపుర్ సారస్వత్ తెలిపారు.
కాగా, వృత్తిరీత్యా ఆర్టిస్ట్ అయిన నుపుర్ సారస్వత్.. తన ప్రదర్శనల నిమిత్తం ఇండియాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ చేరుకున్న ఆమెకు ఇక్కడి దక్కన్ హోటల్ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications